దోషదర్శనం ఆధ్యాత్మిక ప్రగతికి ప్రధాన ఆటంకం. గుణ పక్షపాతం అంటే మంచినే చూసే సుగుణం.. పారమార్థిక పురోగతికి తొలి చిహ్నం. అందుకే మహానుభావులు ఎవరిలోనూ తప్పులను ఎంచరు. పైగా లేశమాత్రంగా ఉన్న సుగుణాన్ని సైతం విశేషంగా ప్రస్తావిస్తారు. ఒకసారి అరుణాచలంలో దీపావళినాడు రమణుల ఆశ్రమం అంతటా దీపాలు వెలిగించారు. సాయంత్రం మహర్షి సన్నిధిలో నరకాసుర ప్రస్తావన వచ్చింది. అప్పుడు భక్తులు యాదృచ్ఛికంగా అరుణాచల పరిసరాల్లో జరిగిన ఓ సంఘటన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే విషయాన్ని రమణులకు వివరిస్తూ ‘భగవాన్! మన ఊరిలో కూడా ఓ నరకాసురుడి లాంటి వాడు చనిపోయాడు. అతను ఎన్నో నేరాలు, ఘోరాలకు పాల్పడ్డాడు. ఇక వాడి పీడ విరగడై పోయింది.
ఈ రోజు మన అరుణాచలానికి అసలైన దీపావళి’ అన్నారు. అప్పుడు మహర్షి గంభీరంగా ‘ఓహెూ అలాగా! అందరూ ఆయన గురించి చెడుగానే చెబుతున్నారే! అతనిలో ఒక్క మంచి లక్షణం కూడా లేదా! మీకు ఓ విషయం తెలుసా! ఆయన రోజూ ఉదయం సాయంత్రం రెండుసార్లు శుభ్రంగా స్నానం చేస్తాడు. అది మీకు తెలుసా?’ అని ఎదురు ప్రశ్న వేశారు. ‘ఎప్పుడూ వ్యక్తిలోని చెడ్డగుణాల గురించి కాదు, మంచి లక్షణాల గురించి మాట్లాడుకోవాలి. మన పురాణాల్లోని రాక్షసులందరు కూడా దేవతల శాపాల వల్ల దురాగతంగా ప్రవర్తించారు. వారి కర్మఫలాలు తీరిపోగానే భగవంతునిలో ఐక్యమైపోయారు’ అన్నారు రమణులు. అలా ఆ దీపావళి రోజున భక్తులకు ఓ దివ్యసందేశం నేర్చుకున్నట్లయింది.
– మనోజ్ఞ