కాశీలో తొమ్మిది రాత్రులు నిద్ర చేయాలంటారు ఎందుకు?
ఎమ్.వందన. కొత్తపేట
మన దేశంలో అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రం కాశీ. వేదాల్లోనూ వారణాసి ప్రస్తావన కనిపిస్తుంది. గంగానది తీరంలో వెలసిన తీర్థరాజం కాశీ. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. వారణాసిని పరమేశ్వరుడే స్వయంగా త్రిశూలాకారంలో రూపొందించాడని శివపురాణం చెబుతున్నది. కాశీలో అడుగుపెట్టినంత మాత్రాన మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చాటుతున్నాయి. ఎవరైనా ఈ క్షేత్రంలో అడుగుపెట్టగానే, ఆ దేహాన్ని పట్టిపీడించే పాపాలన్నీ పక్షి రూపంలో ఎగిరి, పొలిమేరలోని చెట్టుపై కూర్చుంటాయట. ఆ వ్యక్తి తిరుగు ప్రయాణంలో కాశీ పొలిమేర దాటగానే తిరిగి పట్టుకుందామని వేచి చూస్తాయట. తొమ్మిది రాత్రులు పొలిమేరలు దాటకుండా కాశీలో ఉంటే, ఆ పాపాలు తిరిగి వారిని అంటవని, ఆ వ్యక్తులకు పునర్జన్మ ఉండదని స్వయంగా శివుడు పార్వతితో అన్నట్టుగా కాశీఖండం చెబుతున్నది. నవరాత్రులు కాశీలో ఉండి, విశ్వేశ్వరుడి సేవలో తరించిన వారికి మళ్లీ తల్లి గర్భంలో నవమాసాలు ఉండాల్సిన అవసరం రాదని, శాశ్వత మోక్షం ప్రాప్తిస్తుందని నమ్ముతారు. ఈ క్రమంలో కాశీకి వచ్చిన యాత్రికుల్లో నవరాత్రులు అక్కడే ఉండాలనే విశ్వాసం ఏర్పడింది. అయితే, ‘వారణాసికి వచ్చాం, గంగలో మునిగాం ఇక మా పాపాలన్నీ పోయాయి’ అనుకుంటే సరిపోదు. తెలిసీ, తెలియక చేసిన దోషాలపట్ల పశ్చాత్తాపం చెందాలి. మనసులో పరివర్తన రావాలి.
ఇకపై ఎలాంటి తప్పులూ చేయకుండా అనుగ్రహించమని భగవంతుడిని కోరుకోవాలి.
డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370