‘తల్లిదండ్రులతో సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాథలూ, నిరుపేదలతో ఉన్నతంగా వ్యవహరించండి. ఇరుగుపొరుగు, మిత్రులు, బాటసారులు, దాసీ జనంతో ఉదార బుద్ధితో నడుచుకోండి’ అని దివ్య ఖురాన్లో అల్లాహ్ ఉద్బోధించారు. దీన్నిబట్టి మన అమ్మానాన్నలు, బంధువుల పట్ల మనం ప్రదర్శించాల్సిన గౌరవం, వారిపట్ల మనకున్న హక్కులు, బాధ్యతలు ఏమిటో తెలుస్తున్నది. ఇస్లాం ప్రవచనం ప్రకారం మనల్ని చిన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడిన మన తల్లిదండ్రులను వారి ముసలితనంలో కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
వారు మనకు విసుగు తెప్పించినప్పటికీ ‘ఛీ’ అని అనకూడదు. ఇక బంధువులు మనతో అనుచితంగా ప్రవర్తించినా, మనతో తెగదెంపులు చేసుకున్నా వారిపట్ల ‘సిలారహ్మీ’ (బంధుప్రేమ) కలిగి ఉండాలి. వారితో మంచిగా మెలగడం చాలా అవసరం. ‘నీతో సత్సంబంధాలు పెట్టుకున్న వారితో నేనూ సత్సంబంధాలు పెట్టుకుంటాను. నీతో తెగదెంపులు చేసుకొనే వారితో నేనూ తెగదెంపులు చేసుకుంటా’ అని అల్లాహ్ సృష్టిరాశులను సృష్టించినప్పుడు బంధుత్వానికి అభయమిచ్చారు.
బంధువులను తెగదెంపులు చేసుకొనేవాడు స్వర్గంలోకి ప్రవేశించడని ఆయన స్పష్టం చేశారు. బంధువులను విడదీయడం లాంటి పాపకార్యాలకు పాల్పడకూడదని ఇస్లాం హెచ్చరిస్తున్నది. దానధర్మాల విషయంలో నిరుపేద బంధువులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇస్లాం హదీసుల హితవాక్యాల నేపథ్యంలో తల్లిదండ్రులు, బంధువుల పట్ల గౌరవం కలిగి ఉండి, వారిపట్ల కలిగి ఉన్న హక్కులను, బాధ్యతలను నెరవేర్చాలి.
-ముహమ్మద్ ముజాహిద్, 96406 22076