ఓ రాజుకు రాత్రివేళల్లో తన రాజ్యం ఎలా ఉంటుందో చూడాలనిపించింది. అందుకని ఒకమంచి చలికాలం రాత్రి ఓ వీధిలో నడుస్తూ ఉన్నాడు. అప్పుడు రాజుకు ఓ వృద్ధుడు ఇంటి ముందు చొక్కా వేసుకోకుండా పడుకుని ఉండటం కనిపించింది. దుప్పటి కూడా కప్పుకోకుండా అంత చలిలో అతను పడుకుని ఉండటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు.‘వణుకు’ ఛాయలు ఆ వృద్ధుడి ముఖంలో కానీ, శరీరంలో కానీ ఎక్కడా కనిపించలేదు.
‘నీకు చలి వేయడంలేదా?’ అడిగాడు రాజు. ‘అనిపించడం లేదు’ బదులిచ్చాడు ఆ వృద్ధుడు. ‘గడ్డ కట్టేంత తీవ్రమైన ఈ చలిలో దుప్పటి కప్పుకోకుండా పడుకోవడం మంచిది కాదు, నేను రేపు నీకొక దుప్పటి తెచ్చి ఇస్తాను. ఎముకలు కొరికే చలి బారినుంచి తప్పించుకోవచ్చు!’ అని చెప్పి రాజు తన మందిరానికి వెళ్లిపోయాడు.
మర్నాడు తన పనుల హడావుడిలోపడి రాజు వృద్ధుడి విషయమే మరిచిపోయాడు. రెండు రోజుల తర్వాత రాజుకు ఆ వృద్ధుడి సంగతి గుర్తుకువచ్చింది. ఆ రోజు రాత్రి దుప్పటి తీసుకొని వృద్ధుడి దగ్గరికి వెళ్లాడు. వృద్ధుడి శరీరం సగానికి సగం కుంచించుకుపోయింది. చలికి అతను తీవ్రంగా వణికిపోతూ కనిపించాడు. రాజు అందించేలోగా దుప్పటిని లాక్కొని గబగబా కప్పుకొన్నాడు వృద్ధుడు. దిగ్భ్రాంతి చెందిన రాజు ‘ఆ రోజు నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు చలే లేదన్నావు, ఈరోజు దుప్పటి కోసం ఇంతలా వెంపర్లాడుతున్నావు కారణమేంటి?’ అని అడిగాడు.
‘రాజా మీరు నాకు దుప్పటి ఇస్తాననేంత వరకు నాకు ఆ స్పృహే లేదు. మీరు చలి, దుప్పటి గురించి చెప్పినప్పటి నుంచీ నాలో అవే ఆలోచనలు మొదలయ్యాయి. చలికి గజగజ వణకడం మొదలైంది. దుప్పటి మీద కలవరం పుట్టింది’ అని సమాధానమిచ్చాడు.
‘కోరికలు ఉంటే కంటి మీద కునుకు ఉండదు. కోరికలు లేకపోతే జగత్తు సైతం తృణప్రాయం’ అని పండితులు చెప్పింది గుర్తుకు వచ్చింది రాజుకు. చిన్నగా అక్కడి
నుంచి కదిలాడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821