తన దృష్టిలో ‘భాగవత పురాణ ఫల రసాస్వాదన’ కన్న ఉత్కృష్టమైన పదవి సృష్టిలోనే లేదు. బ్రహ్మలోకాన్ని సైతం తృణీకరించడం- వద్దని వదలడం వైరాగ్యానికి ఆఖరి హద్దు. పరమ భాగవతులు పంచమ పురుషార్థమైన భక్తి లేక కైవల్యపదాన్ని కాక కల్లలైన ఇతర చిల్లర పదవులను ఒల్లరు (ఇష్టపడరు) గాక ఒల్లరని భక్తకవి తల్లజుడు పోతన బల్ల చరచి వెల్లడించాడు.
శుక మహర్షి రాజర్షి పరీక్షిత్తుతో… యోగేశ్వరుడు కృష్ణుడు కాళియుని భోగ తతిని- పడగల సమూహాన్ని అతి దారుణంగా చితకబాదటం భూతి- భాగ్యం ఎలా అవుతుంది? అన్న శంకా నివారణ చేస్తూ పన్నగ సతులు నంద సుతుని రూపాన ఉన్న శ్రీపతిని- కన్నయ్యను ఇంకా ఇలా సన్నుతించారు- అహి(సర్ప) మర్దనా! పూర్వకాలంలో మహిళా రత్నం శ్రీదేవి బహుకాలం తపస్సు చేసి, నేమించి (దీక్షతో) ఎన్నో నోములు నోచి, నిన్నే కామించి సేవించింది. ఆ పూజాఫలంగా అంబుజాసన (లక్ష్మి), దేదీప్యమానంగా వెలుగొందే నీ పాదారవిందాల పరాగ (ధూళి) కణాలను పొందే, కాదు కాదు, తాకే అర్హతను ఓ బర్హావతంసా!- (సిగలో నెమలిపింఛం నగగా గల ఓ పన్నగశయనా!) సంపాదించుకోగలిగింది. అలాంటిది ఏ విధమైన యోగ్యతా లేకనే ఈ కాళియుడు తావక- నీ పవిత్ర పాదస్పర్శకు నోచుకున్నాడే! ఇది ఎంత అద్భుతం స్వామీ!
ఉ॥‘ఒల్లరు నిర్జరేంద్ర పద మొల్లరు బ్రహ్మపదంబు నొందగా
నొల్లరు చక్రవర్తి పద మొల్లరు సర్వరసాధిపత్యము
న్నొల్లరు యోగసిద్ధి మరి యొండు భవంబుల నొందనీని నీ
సల్లలితాంఘ్రిరేణువుల సంగతి నొందిన ధన్యులెప్పుడున్’
‘ఓ నిర్వాణ (ముక్తి) పతీ! జన్మ రాహిత్యాన్ని కలిగించే అతి లలితమైన నీ పాద రేణువుల సంగతి (స్పర్శ) పొందిన ధన్యులు- అనన్య భక్తి సంపన్నులు, సార్వభౌమ- చక్రవర్తి పదవిని గాని, వరుణ లోకాధిపత్యంగాని, అణిమా గరిమాది యోగసిద్ధిని గాని, శక్ర- దేవేంద్ర పదవి గాని, కడకు పరమేష్ఠి- బ్రహ్మపదాన్ని కూడా సదా ఇష్టపడరు కదా!’
మూలంలోని ‘యత్పాద రజః ప్రపన్నాః’ అన్నదానికి పెంపుదల పై పద్యంలోని నాల్గవ పాదం. ఆరంభం (పీఠిక)లోనే అమాత్యుడు ‘శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్’ అనీ, ‘నే పలికిన భవహర మగునట’ అనీ, ‘నా జననంబున్ సఫలంబు జేసెద పునర్జన్మంబు లేకుండగన్’ అనీ ఘంటాపథంగా పలికాడు గదా! కాళియ కాంతలు బాలకృష్ణునితో… ‘నేరము గల్గు మద్విభుని నేడిట గావగదే కృపానిధీ’- ఓ కరుణానిధీ! నీ సన్నిధిలో నేరాలు ఉంటాయా? తనయుల నేరాలను తండ్రులు పట్టించుకోరుగా! ఓ నందపట్టీ! నీవు జగత్తుకే తండ్రివి గదా! మా భర్త అపరాధాన్ని మన్నించు. మాధవా! మేము మాంగళ్యాన్ని కోల్పోయి వైధవ్యాన్ని భరించలేము.. ‘అనాథాలాప మాలింపవే, చాలున్నీ పద తాడనంబు పతి భిక్షంబెట్టి రక్షింపవే’- లక్ష్మీనాథా ఈ అనాథల దీనాలాపాలు ఆలించు. నీ పాద తాడనం చాలించు. ఓ పక్షివాహనా! మాకు పతిభిక్ష ప్రసాదించు. మా సౌభాగ్యాన్ని రక్షించు.
ఆ॥‘మమ్ము బెండ్లిసేయు మా ప్రాణవల్లభు
ప్రాణమిచ్చి కావు భక్తవరద!
నీవు సేయు పెండ్లి నిత్యంబు, భద్రంబు
చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు’
చక్రపాణీ! మా ప్రాణపతి ఈ కాళియుని ప్రాణాలు కాపాడి, ఇతనితో మాకు మరల పాణిగ్రహణం జరిపించు, మాపై శుభాలు కురిపించు. పన్నగశయనా! మా చిన్ననాటి పెళ్లి పెళ్లే కాదు. బమ్మ తండ్రీ! మా దృష్టిలో అది బొమ్మల పెళ్లి మాత్రమే! నీ చేతుల మీదుగా జరిగే ఈ ముద్దుగుమ్మల కల్యాణం శాశ్వతం, శుభంకరం.
శుకుడు పరీక్షిత్తుతో- రాజా! కాళియుని పెళ్లాలు ఇలా జాలిగా వేడుకొనగా వనమాలి వారి విన్నపం ఆలించి అనుగ్రహించాడు. కాళియుని తలలపై తన కాలి తాపులు ఆపుచేసి పక్కకు తొలగిపోయాడు. విషధారి కాళియుని దారికి తేవడమే దానవారి అభిమతం. వానిని సంహరించడం అసురారి సంకల్పం కాదు. పన్నగరాజు బడలి సన్నగిల్లి (కృశించి)న తన పడగలను సవరించుకొంటూ, కడు ఆయాసపడుచూ, కడలి శయనునికి- ఆపన్న శరణ్యునికి అంజలి ఘటించి తిన్నగా ఇలా విన్నవించాడు- కాలాత్మకా! బాలకృష్ణా! మా వ్యాల- సర్పజాతి నీ లీలా సృష్టిలోనిదేగా! సహజమైన మా స్వభావం ఓ అజా(మాయా)పతీ! నీకు తెలియంది కాదు. అది ఎవరికైనా దుస్త్యజమే- విడువరానిదే! మా వికృత చేష్టలు- వంకర నడకలు, విషపు కోరలు సృష్టికర్తవైన నీకు ఎంతమాత్రం వింతలు కావు. యదురాయా! నీ మాయ దురత్యయ- దాటరానిది. మా తెలివితేటలు దానిముందు నీటిమూటలే! సర్వజ్ఞా! అజ్ఞానినైన నా అవజ్ఞను- ధిక్కారాన్ని సైరించు. సర్వం తెలిసిన నీవు నన్ను రక్షించినా సరే, శిక్షించినా సరే!
క॥‘నా పుణ్యమేమి సెప్పుదు?
నీ పాదరజంబు గంటి నే సనకాదుల్
నీ పాదరజము గోరుదు
రే పదమందున్న నైన నిటమేలు హరీ!’
శ్రీహరీ! ధీరులు, ఆశాదూరులు, సదా కుమారులు, నివృత్తి పరాయణులు అయిన సనకాది మహర్షులు కూడా నీ పాదధూళి పొందటానికి పరితపిస్తూ ఉంటారు. దీన శరణ్యా! అట్టి చరణ ధూళి నాకు లభించింది. నా పుణ్యమేమని చెప్పను? నీ కృపకు నోచుకున్న నాకు ఎక్కడున్నా మేలే జరుగుతుంది.’ ఇలా విన్నవించుకున్న కాళియుని మాటలు విని సర్వేశ్వరుడు కృష్ణుడు ఇట్లన్నాడు… ‘ఓ కాళియా! ఈ మడుగులోని నీటిని ఆవులే కాదు, మానవులూ తాగుతుంటారు. కాన, నీవు ఇకముందు ఈ మడుగులో ఉండవద్దు. భార్యాబిడ్డలతో, బంధువర్గంతో కూడి వడిగా సింధువు- సముద్రంలోని నీ పూర్వనివాస స్థలమైన ‘రమణక’ ద్వీపానికి వెళ్లిపో. గతంలో అక్కడున్న నీవు గరుత్మంతుని భయంతో ఈ మడుగులో వచ్చి చేరావు. నీ పడగల మీద నా పాదాల గుర్తులు చూసి.. పక్షిరాజు నీకు ఇక ఏమాత్రం ప్రతిపక్షి కాడు. నీవు, నీ కుటుంబం ఇక సురక్షితం. అనంతుని ఆజ్ఞను ఔదల దాల్చి కాళియుడు పరమాత్మకి అనేక అమూల్య ఆభరణాలు కానుకలుగా అర్పించి, పలుమారులు ప్రణమిల్లి, ప్రదక్షిణలు గావించి అనుజ్ఞ గైకొని సపరివారంగా రమణక ద్వీపానికి చేరుకున్నాడు. శుకుడు…
క॥‘వారిజ లోచను డెవ్వరు
వారింపగ లేని ఫణి నివాస త్వంబున్
వారించి యమున సుధా
వారిం బొలుపారె నెల్లవారికి బ్రియమై
రాజా! వారిజాక్షుడు హరి ఎవ్వారికి వారింప (తొలగింప) వీలుకాని యమునా వారి (జలం)లోని విషధారి కాళియుని నివాసాన్ని తొలగించగానే కాళిందీ నది అమృతం లాంటి జలంతో నిండి కళకళలాడుతూ అందరికీ ఆనందదాయకమయింది.
శుకుడు పరీక్షిత్తుతో… ‘రాజా! సౌభరి మహర్షి శాపం వలన పాప (సర్ప) జాతికి శత్రువైన సుపర్ణుడు- గరుడుడు చావు- చచ్చే భయంతో యమున మడుగు జోలికి వచ్చేవాడు కాదు. ఒకనాడు పక్కిరాయడు- పక్షిరాజు ఆ మడుగులోని మత్స్యరాజును ముక్కుతో పొడిచి చంపి మక్కువతో చక్కగా మెక్కివేశాడు. మిగిలిన బడుగు మీనములన్నీ కలవరపడుతూ కడు దీనంగా ఏడుస్తూంటే వాటి గోడు చూడలేక దయాశీలి సౌభరి జాలిపడి, కోపించి ‘ఈనాటి నుండి చిలువల తిండి- గరుడుడు వచ్చి చేపలను చంపి తింటే వెంటనే చచ్చిపోవుగాక’ అని శకునీశ్వరుని- ఖగనాథుని ముని శపించాడు. ఇలా శాపమని కాళియుని కొక్కనికే తెలుసు’- ఇలాగని శుకముని అవనీపతి పరీక్షిత్తుకు వివరించాడు.
లీలా పరమార్థం: ‘కాళియః ఇంద్రియాణ్యాహుః విషయా స్తద్విషం స్మృతమ్’. ఇంద్రియా ధ్యాసయే కాళియ నాగు. వాడు యమునలో పాగావేసి హాయిగా ఉంటున్నాడు.
యమున, యమళార్జున భంజను (కృష్ణు)ల సంబంధం అవినాభావం. కాళింది- యమున కృష్ణభక్తికి ప్రతీక. ఇంద్రియాలే కాళియుని పడగలు. ధర్మ విరుద్ధమైన విషయ భోగాల యందలి మితిలేని ఆసక్తియే పడగలలోని విషం. విషం తిన్నవాణ్నే చంపుతుంది. విషయాలు (శబ్ద స్పర్శ రూప రస గంధాలు) కన్నవాణ్నే కాక, మనసులో అనుకొన్న (స్మరించిన) వాణ్ని కూడా చంపుతాయి. భక్తి- భోగాలు పరస్పర విరుద్ధాలు. భక్తి మిష(నెపం)తో చాటు, మాటుగా ఇంద్రియాలతో ధర్మ వ్యతిరేకంగా విషయాలు అనుభవించు వాడే గాటైన కాటువేసే కాళియుడు. భక్తిలో భోగలాలసత అనే భోగి- సర్పం చొరబడితే భక్తికి అది చెఱ- నిర్బంధం. భక్తి మార్గానికి ప్రముఖ ఆచార్యులు- శంకర, రామానుజ, వల్లభ, రామానంద, చైతన్య, తులసి మొదలగు వారంతా పరిపూర్ణ వైరాగ్య సంపన్నులు. పూర్ణ వైరాగ్యం లేనిదే పరా (శుద్ధ) భక్తి కలుగదు. భక్తి, జ్ఞాన వైరాగ్యాలకు జనని. కాళియుని వంటి భోగ పురుషులు ప్రవేశించగా భక్తి యమున నేడు విషపూరితమవుతోంది. ‘భోగే రోగ భయం’ అని నీతిశాస్త్ర హెచ్చరిక! భోగాలు పెచ్చరిల్లితే ఇంద్రియాలు చచ్చుబడి పోతాయి.
పవిత్రమైన భక్తి వలన వాటికి శక్తి- పుష్టి చేకూరుతుంది. భోగ శబ్దానికి పడగ అని కూడా అర్థం కదా. భోగం కలది భోగి- సర్పం. లోకంలో భోగ పురుషులు- విషయ లంపటులందరూ భోగులే- సర్ప సమానులే! ఎందుకని? ‘నానుపహత్య భూతాని భోగః సంభవతి’- (జీవహింస చేయనిదే సాధారణంగా అమితమైన భోగానుభవం సంభవం కాదు) అని వ్యాస పాతంజలి భాష్యం. భగవానుడు అసురులను సంహరించాడు. కాని, కాళియుని కడతేర్చక నిలుకడగా విషం కక్కించాడు. కాన, సాధనలో అదే ఆదర్శం. ఇంద్రియాలను వివేక వైరాగ్యాలతో స్వాధీనపరచుకోవాలి. వాటిని ‘రమణక’ ద్వీపానికి పంపాలి. అనగా ప్రయత్నపూర్వకంగా పరమాత్మ యందు, సత్సంగమునందు ‘రమింప’ జెయ్యాలి. అఖండానంద స్వామి, డోంగ్రేజీ వంటి ప్రవక్తలు ఈ లీలా పరమార్థాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006