ఆధ్యాత్మికత సమష్టి కృషి కాదు. వ్యక్తిగతమైన సాధన, వృద్ధి, సిద్ధి. అందుకు ధైర్యం, ైస్థెర్యం కావాలి. సత్యాన్ని తెలుసుకోవడంలో అవసరమైతే తన పూర్వ అభిప్రాయాలను దాటగల ధైర్యం ఉండాలి. తెలుసుకున్న తర్వాత దృష్టి విక్షేపం చెందని ైస్థెర్యం కావాలి. లౌకిక జీవనాన్ని సంస్కరించుకుంటూనే ఆధ్యాత్మికంగా వికసించవలసి ఉంటుంది. ఆ సంస్కరణకు ఆధారమే వ్యక్తిగత నిబద్ధత. అంటే ఇతర ప్రాబల్యాలకు లోనుగాక అకుంఠిత దీక్షతో ముందుకుసాగడం. ఆ సంస్కరణలో భాగమే విజ్ఞత, కృతజ్ఞత, వినయం, కర్తవ్యనిష్ఠ, ప్రేమను జీవనవిధానంలో పండించుకోవడం. తద్వారా సమాజంతో, ప్రకృతితో మధురాత్మీయత పొంది అనంత విశ్వచైతన్యంలో మమైకం చెందగలుగుతాం. ఒకరకంగా వ్యక్తిగత నిబద్ధత ద్వారా ప్రత్యక్ష ప్రకృతితో పొందే ఆత్మీయభావమే ఇటు మానవత్వానికి, అటు దైవత్వానికి మధ్య వారధి.
అన్ని దేశ కాలాలలో వివిధ సంస్కృతులు, మతాలు, సంప్రదాయాలు, ఆచారాల ముఖ్య ఉద్దేశం మానవ జీవితానికి రక్షణ, పోషణ, అభయం, చికిత్స, విజ్ఞానం, గౌరవం, సుఖం, సంస్కారవంతమైన ప్రగతిని అందించడమే! అయితే ఏ సమాజ వికాసానికైనా ఆధారం దానికున్న ప్రాకృతిక సంపద, మానవ సంపద. ప్రకృతిది కాలగతమైన, నియమబద్ధమైన చక్రీయగతి కాబట్టి, అనిశ్చితి తక్కువ. ప్రకృతి సంపదను రక్షించడం, పోషించడం, ఒక పరిమితికి లోబడి పెంచడం సులభమే! కానీ, మానవ సంపదను సంరక్షిస్తూ, సంవర్ధనం చేయడమే చాలా కష్టం. ప్రత్యేకించి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఇది అంత సులభం కాదు.
ఇందుకు ప్రధాన కారణాలు రెండు. ఒకటి, మనిషి ఇంద్రియ సుఖంపై ఉన్న ఇచ్ఛ. రెండోది పరిధులు పెంచుతూ ప్రజాస్వామ్యం ఇచ్చే స్వేచ్ఛ. వీటికి అనుబంధంగా మరో రెండు కారణాలున్నాయి. సాంకేతికత వస్తు సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడం. వాటి వినియోగం కోసం బహు విధాలుగా ప్రేరేపించే విధంగా వివిధ ప్రసార సాధనాల నిరంతర ప్రయోగం. ఈ కారణాలు మానవ సంపద అభివృద్ధికి కావలసిన ఏకాగ్రతను, నిష్ఠను, నిబద్ధతను నిత్యం విచలితం చేస్తుంటాయి. పలుచబరుస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమైన ఉద్ధారక శక్తులు రెండే! ఒకటి, సంస్కారవంతమైన కుటుంబం. రెండు, సమున్నతమైన శాస్ర్తావగాహనతో పాటు శీల బలం, ప్రేమగుణం కలిగిన గురుస్థానం. ఇవి మాత్రమే కొంతమందినైనా పటిష్ఠమైన నిబద్ధత కలిగిన వ్యక్తిత్వాలుగా మలుస్తాయి.
అయితే, వ్యవహార ప్రపంచంలో కనబడే విధి నిర్వహణలో అలసత్వం, ఆర్థికపరమైన అవినీతి, అధికార నియంత్రణ, వర్గ విభేదాలు, నిజాయితీకి తగిన న్యాయఫలాలు దక్కకపోవడం వంటివి సగటు మనిషి ధర్మనిష్ఠను బలహీనపరుస్తాయి. ఇటువంటి సందర్భంలో విశాలదృష్టిని పెంపొందించుకున్న సనాతన సాంస్కృతిక వ్యవస్థల, స్వచ్ఛంద సంస్థల భూమిక కీలకమవుతుంది. అటువంటి సామాజికశక్తులు సరళ జీవనులైన, విజ్ఞానులైన, సేవాభావం కలిగిన నిజాయితీపరులను గౌరవించి, సన్మానించడంతో పరివ్యాప్త పరిస్థితులకు అతీతంగా వ్యక్తిగత నిబద్ధత నిలదొక్కుకొని ప్రవర్ధిల్లుతుంది. ఆ విధంగా భవిష్యత్తులో, అనుకూల సమయంలో ధర్మబద్ధమైన సామాజిక పునర్నిర్మాణానికి కావలసిన ఉజ్జ్వలశక్తి సజీవంగా కొనసాగుతుంది. సమాజంలో లౌకికమైన స్వేచ్ఛ ఎంతగా వ్యాప్తి చెందుతుంటే వ్యక్తిగత నిబద్ధత అంతగా అరుదైపోతుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాంకేతికతను ఉపయోగించకుండా ఉండలేం! కానీ, అదే పరమావధిగా భావించి దానికి బానిస కాకుండా ఉండాలి. అభివృద్ధి పథంలో ఎంత దూసుకుపోతున్నా, మూలాలను విస్మరించకుండా, ఆధ్యాత్మిక మార్గాన్ని దాటిపోకుండా ఎవరికి వారు నిబద్ధులై జీవనం కొనసాగించాలి.
యముగంటి ప్రభాకర్
94401 52258