తెలియక చేసినా, తెలిసి చేసినా తప్పును దిద్దుకోవాలి. పశ్చాత్తాపంతో ఆ పాపాన్ని కడిగేసుకోవాలి. తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. విద్య, ఉపాధి మార్గాల్లో చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి. తప్పులు చేస్తున్నాడంటే.. ఏదో ప్రయత్నిస్తున్నాడన్న మాటే! పదేపదే అదే తప్పు చేస్తుంటే నిర్లక్ష్యం కారణం అనుకోవచ్చు. ‘అలవాటులో పొరపాటు’ అనుకుంటూ నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తే చివరికి చిక్కుల్లో పడాల్సి వస్తుంది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ధోరణి అన్నిటికన్నా ప్రమాదకరమైనది. కలగబోయే విపత్తును ఒప్పుతో ఎదుర్కోవాలే కానీ, తప్పుతో తప్పించుకుంటామంటే ముప్పు తప్పదు. ఇలాంటి వైఖరి కలిగినవారు చివరికి ఎవరికీ కాకుండా ఒంటరిగా మిగిలిపోతారు. రావణాసురుడు, దుర్యోధనుడు ఇలాంటి విధానాన్నే అనుసరించి తమ పతనానికి తామే నాంది పలికారు.
కనుసైగలతో అష్టదిక్పాలకులను, నవగ్రహాలను శాసించిన తపశ్శాలి రావణుడు. బ్రహ్మదేవుడు తరచూ వస్తూ రావణుడికి భవిష్యవాణి చెప్తూ ఉండేవాడట. ఓ రోజు భవిష్యవాణి చెప్పడానికి వచ్చిన బ్రహ్మదేవుడితో రావణుడు ‘నన్ను చంపేదెవరు?’ అని ప్రశ్నించాడట. అప్పుడు బ్రహ్మ ‘రఘుకులంలో దశరథ, కౌసల్య దంపతులకు జన్మించే రాముడి చేతిలో నీకు మృత్యువు తప్పదని చెప్తాడు. తనకు ఎవరి చేతుల్లోనూ మరణం ఉండకూడదని వరం పొందిన రావణుడు, నరుడి వల్ల ముప్పు తప్పదని గ్రహిస్తాడు. గ్రహగతులను మార్చేయగల శక్తి ఉన్న ఆయన దశరథుడు, కౌసల్య కలుసుకోకుండా కుట్రపన్నుతాడు. కౌసల్యను సముద్రంలో పడవేయిస్తాడు. ఆమెను ఒక చేప మింగుతుంది. మరోవైపు సురాసుర యుద్ధంలో దేవతల పక్షాన పోరాడుతాడు దశరథుడు. ప్రమాదవశాత్తు అతనూ సముద్రంలో పడిపోతాడు. దశరథుడూ ఆ మీనం గర్భంలోకే చేరతాడు. అలా కౌసల్య, దశరథుడు చేప కడుపులో కలుసుకుంటారు. వారి వివాహమూ అందులోనే జరుగుతుంది. తర్వాత సీతాదేవి అపహరణకు ముందే, రాముడు దశరథ నందనుడు అని తెలిసినా రావణుడు తన ప్రయత్నం విరమించుకోడు. తప్పు మీద తప్పు చేస్తూ, దిద్దుకునే అవకాశాలు వచ్చినా, పక్కదారిపడుతూ రాముడి చేతిలో హతుడయ్యాడు.
చేసిన తప్పునకు పశ్చాత్తాపం వ్యక్తం చేయని దుర్యోధనుడి గతి కూడా పాఠం చెప్తుంది. ఒకరోజు ధృతరాష్ర్టుడు సభలో కొలువుదీరి ఉన్నాడు. అక్కడికి మైత్రేయ మహాముని వస్తాడు. మునికి స్వాగతం పలుకుతాడు రాజు. కుశల ప్రశ్నలయ్యాక.. పాండవుల ప్రస్తావన తెస్తాడు మైత్రేయ ముని. ధర్మమార్గంలో నడుస్తున్న పాండవులను ఇంకా ఇక్కట్ల పాలు చేయకుండా, వారికి అర్ధరాజ్యం ఇచ్చి చేసిన తప్పును దిద్దుకోమని హెచ్చరిస్తాడు. ముని మాటలను లక్ష్యపెట్టకుండా కాలి వేళ్లతో నేలను రాస్తూ, తొడగొట్టి అట్టహాసంగా నవ్వుతాడు దుర్యోధనుడు. అతని వికృత చేష్టకు మండిపడతాడు మైత్రేయుడు. ‘భీముడి గదా ఘాతంతో నీ తొడలు భగ్నమవుతాయ’ని శపిస్తాడు. దృతరాష్ర్టుడు శాప విమోచనం అనుగ్రహించమని కోరగా, ‘ఇకనైనా తప్పులు చేయకుండా ఉంటే, ముప్పు తప్పుతుంద’ని చెప్తాడు. కానీ, సుయోధనుడు తన ప్రవర్తన మార్చుకోడు. అజ్ఞాతవాసం పూర్తయిన పాండవులు కనీసం ఐదూళ్లు ఇచ్చినా చాలని రాయబారం పంపినా వీలు కాదంటాడు. చివరికి భీముడి గదా ఘాతంతో తొడలు విరిగి కన్నుమూశాడు.
తప్పులను దిద్దుకోకపోతే జరిగే పరిణామాలెలా ఉంటాయో ఈ దృష్టాంతాలు చెప్తాయి. చిన్న తప్పు, పెద్ద తప్పు అన్న భేదాలుండవు. తప్పు.. తప్పే! దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం పాపమవుతుంది. ఆ పాపం, శాపంగా పరిణమిస్తుంది. చివరికి జీవితంలో కోలుకోలేని దుస్థితికి దిగజారుస్తుంది. కన్నుమూసిన తర్వాత కూడా ‘తప్పుడు మనిషి’ అన్న అపనింద మాత్రం అలాగే మిగిలిపోతుంది.
–ఎ.భరత్‌కుమార్ శర్మ