శుకయోగి పరీక్షిత్తుతో… రాజా! యయాతి శాపం వలన యాదవ వీరులకు రాజపీఠం ఆమోద యోగ్యం కాదు. కాన, దామోదరుడు, సత్యావధానుడు- సత్యవ్రతుడు, దాన శీలుడు, మాననీయుడు- గౌరవార్హుడు, కానివాని (శత్రువు)కి భయంకరుడు, పుత్రుడైన కంసునిచే కారాగృహంలో బంధింపబడి, ఆపై వాని మృతి వలన అతి దీనుడై ఉన్న వృద్ధుడైన ఉగ్రసేనునితో ప్రేమ మీరగ ఇలా విన్నవించాడు.. తాతా! ఈ భూమికి నీవే అధిపతిగా ఉండు. నీ కనుసన్నలలో మేము నిన్ను సేవిస్తూ ఉంటాము. దేవతలే నీకు కప్పం చెల్లిస్తారు.
ఇక ఇతర రాజులు నరపతివైన నీకు తప్పక తలలు వంచుతారని వేరుగా చెప్పడమెందుకు? ఇట్లు పలికి, యాదవులకు ఏడుగడ (తల్లి, తండ్రి, గురువు, దైవము, పురుషుడు, విద్య, దాత అనే ఏడు విధాల రక్షకుడు) అయిన మాయా మానుష విగ్రహుడు మాధవుడు ఉగ్రసేనుని వేడుకతో సముదగ్ర (విశాలమూ, శత్రు భయంకరమూ)మైన మథురా రాజ్యానికి రేడు (రాజు) గావించాడు. అటు పిమ్మట, కపట సంసారియైన కంసారి కృష్ణుడు, పూర్వం హింసకు మారుపేరైన కంసుని భయము కతన (వలన) ఇతర దేశాలలో వెతలు- అగచాట్లు (శ్రమలు) పడుతున్న తన జ్ఞాతులూ, చుట్టాలూ అయిన యాదవులు, వృష్ణులూ, భోజులు, మధువులు, దశార్హులు, కుకురులు, అంధకులు ఆదిగాగల వారినందరినీ మెప్పించి, ఆదరంతో మథురకు రప్పించాడు. వారి చిత్తాలు మనసులు సంతసించే విధంగా వారికి విత్తాలు ధనాదులు ఇప్పించి, నివాసానికి గృహాలు కల్పించాడు…
క॥ ‘మధుసూదన సత్కరుణా
మధురాలోకన విముక్త మానస భయులై
మధుర వచనముల వారును
మధురా నగరంబు ప్రజలు మనిరి నరేంద్రా!’
శుకుడు రాజా! కరుణ రసంతో నిండిన మధుసూదనుని మృదు మధురాలైన కృపా కటాక్ష వీక్షణాలతో మనసులోని భీతి తొలగిపోగా, వారూ, మథురా నగర ప్రజలు పరస్పర ప్రీతి అనురాగపూర్వక సరస సంభాషణలతో కలసి మెలసి జీవింపసాగారు. అనంతరం, రామన్నతో కూడి వెన్నుడు గోవిందుడు, తమను కన్న బిడ్డల కంటె మిన్న (అధికం)గా పెంచి పోషించిన నందుని వస్త్ర, ఆభరణాలతో సత్కరించి, కౌగిలించుకొని మన్ననతో వ్రేపల్లెకు సాగనంపాడు. ఖిన్నుడైన నందుడు వాత్సల్యంతో విలవిల్లాడుతూ, కన్నీరు పెట్టుకొని గొల్లపెద్దలతో కలసి వెళ్లలేక వెళ్లలేక కుళ్లుతూ కుమిలిపోతూ వ్రేపల్లెకు వెళ్లిపోయాడు.
తరువాత చూడాకర్మ, చేలాది సంస్కారాలు పొంది రామకృష్ణులు గర్గాచార్యులచే ‘.. భర్గో దేవస్య ధీమహి..’ అనే గాయత్రీ మంత్రాన్ని గ్రహించి, అనర్గళం (నిరాటంకం)గా జపించి, బ్రహ్మచర్య వ్రతం అనుష్ఠించారు. ‘ఆచార్యవాన్ పురుషో వేద’ ఆదరంతో ఉత్తముడైన గురువును ఆదరువు ఆశ్రయంగా కలిగి ఉన్నవాడే మాయా సంసారపు బరువును సులభంగా దించుకోగలడని లోకానికి బోధించాలని, అనాది గురు పరంపరను ఆదరించాలని ఖలవిదారి మురారి, తానే జగద్గురువైనప్పటికీ, అన్నతో కలసి ఆచార్యుని అన్వేషిస్తూ అవంతీ (ఉజ్జయిని) పురాన్ని చేరుకున్నాడు. అన్ని విద్యలకు పేరెన్నికగన్న ఏకైక ఖని గని వంటివారూ, సర్వజ్ఞులూ అయిన రామకృష్ణులిరువురూ అచ్చట నివసిస్తున్న సాందీపనిని ఆచార్యునిగా ఎంచుకొని, భక్తి శ్రద్ధలతో సేవించి, అరవై నాలుగు దినాలలో అరవై నాలుగు విద్య కళలను వినికిడి చేతనే (ఏకసంథాగ్రాహులై) నేర్చుకున్నారు. గురుకులంలో అధ్యయనం ముగిసింది. సాందీపనిని గురుదక్షిణ కోరమన్నారు. శిష్యుల మాహాత్మ్యాన్ని, ప్రభావాన్ని గుర్తించి ఆశ్చర్యపడ్డ సాందీపని, ‘ఇంచుకంత అల్పమైన దానిని కోరితే నేను వంచితుణ్నవుతాను. ఇప్పుడు మించుకు పోయిందేమున్నది గనక!’ అని మదిలో ఎంచి, తన హృదయేశ్వరి ఇల్లాలిని సంప్రదించి రామకృష్ణులతో
శా॥ ‘అంభోరాశి బ్రభాస తీర్థమున మున్నస్మత్తనూ సంభవుం
డంభోగాహము సేయుచున్ మునిగి లేడయ్యెం గృపాంభోనిధుల్
శుంభద్వీర్యులు మీరు మీ గురునికిం జోద్యంబుగా శిష్యతన్
గాంభీర్యంబున బుత్రదక్షిణ యిడం గర్తవ్య మూహింపరే!’
నాయనలారా! మా పుత్రుడు మునుపు సముద్రంలో ప్రభాసమనే ఘట్టంలో స్నానం చేస్తూ నీటిలో మునిగి కనిపించకుండా పోయాడు. దయాసముద్రులు, పౌరుష ప్రతాపాలలో అపర రుద్రమూర్తులు అయిన మీరు మాకు అంతేవాసులు శిష్యులు అయ్యారు. అయ్యలారా! మా భాగ్యమెంతటిదో! కనుక, అందరికి అచ్చెరువు కలుగునట్లు గురువుకు దక్షిణగా మా కొమరుని తెచ్చి ఇవ్వండి. ఇది మీ బాధ్యతగా గుర్తించండి. వెళ్లండి’ అని ఆదేశించాడు. శుకుడు రాజా! రామకృష్ణులు వెంటనే సాగర సమీపానికి వచ్చి మా గురు పుత్రుని మాకు అప్పగించమని గర్జించారు. అతనిని పంచజనుడనే కంబు (శంఖ) రూపం ధరించిన దైత్యుడు మింగాడని సాగరుడు తెలుపగా…
శా॥ ‘శంఖారావము తోడ బంచజనుడున్ శంకించి చిత్తంబులో
సంఖిన్నుండుగ వార్ధి జొచ్చి దహన జ్వాలాభ హేమోజ్జల
త్పుంఖాస్త్రంబున గూల్చి వాని జఠరంబున్ వ్రిచ్చి గోవిందుడ
ప్రేంఖచ్చిత్తుడు బాలు గానక గురు ప్రేమోదితోద్యోగుడై’
అంబుజాక్షుడు శంఖం పూరించాడు. ఆ కంబు ధ్వని విని పంచజనుడు భయ సందేహాలతో కంపించి పోయాడు. అచ్యుతుడు అంబుధి సాగరంలో ప్రవేశించి, అగ్ని జ్వాలలతో సమానములై, బంగారు పింజలతో రంగారు అంబకా బాణాలతో పంచజనుని పడగూల్చి, వాని కడుపు చీల్చి చూడగా గురుపుత్రుని జాడ పొడగట్ట అగుపడ లేదు. శుకుడు రాజా! దానవ విరోధియైన ఆ దామోదరుడు ఆ పంచజనుని దేహంలో జనించిన ‘పాంచజన్య’మనే మానిత గొప్ప శంఖాన్ని గ్రహించాడు. ప్రోడ సర్వజ్ఞుడైన పరమాత్మకు బాలుని జాడ తెలిసినా లీలాలోలుడు తెలియనట్లు వెదకుతున్నాడు. కాలకాలుడు- బాలకృష్ణుడు సంకర్షణ (బలరామ) సహితుడై రథాన్ని అధిరోహించి యమ సదనానికి వెళ్లాడు. ‘సంయమనీ’ నగర ద్వారం వద్ద ప్రళయకాల మేఘపురీతి (వలె) గంభీర ధ్వనితో భీతి గొలిపే పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శంఖఘోష విని, ‘కరకైన నా భుజాదండాన్ని సరకు గొనక లెక్కచేయక కండకావరంతో ఎవడో దుండగీడు (ఆకతాయి) శంఖం ఊదుతున్నాడు ఎవరి అండతోనో! వాడు ప్రచండమైన నా క్రోధాగ్నికి భస్మమైపోతాడు’ అంటూ దండధరుడు మెండైన రోషంతో మండిపడుతూ వచ్చాడు. రామకృష్ణులను చూచి లీలామానవులైన విష్ణుమూర్తులుగా గ్రహించి, భక్తితో నుతించి, నతులు (వందనాలు) సమర్పించి ‘నేనేమి చెయ్యాలో ఆనతి ఇమ్మ’ని అర్థించాడు.
అధోక్షజుడు ఇలా అన్నాడు.. పుణ్యశీలుడవైన ఓ సరణ్యూ (యమధర్మరాజా)! చెపుతా విను. మా గురు పుత్రునిలో తప్పు ఉండబట్టి అతని కర్మానుసారంగా దండించడానికి తెప్పించుకున్నావు. అతణ్ని ఇప్పుడు ఖండితంగా మాకు అప్పగించు, మాకతడు కావాలి. ధర్మరాజా! కర్మ నిబంధనను అలా ఉంచు. ఆ కర్మమర్మం (‘గహనా కర్మణో గతిః’ గీత) నీవెరుగవు. నా ఆనతి ఆజ్ఞ కర్మను మించింది. నా ముందు కర్మ ఎందుకూ కొరగానిది! శుకుడు రాజా! ఈశ్వరుడు ‘కర్తుమకర్తు మన్యధా కర్తుం’ (ఒక విధంగా చేయడానికి, అలా చేయకుండా ఉండటానికి, కాక మరో విధంగా చేయడానికి) సమర్థుడు. అలా కాని ఎడల ఆయన ‘ఐశ్వర్యం’ ఏపాటిది? భగవంతుడు ఏమి చేసినా జీవుల కర్మననుసరించే చేస్తాడన్నది కర్మఠుల కర్మిష్ఠుల భావన. ఇది అభక్తుల భక్తులు కాని వారిపట్ల మాత్రమే చెల్లుబాటవుతుంది. కాని, భక్తుల విషయం అలా కాదు. భగవంతుడు భక్తులయందు భక్తి కలవాడని భాగవతం ఉద్ఘోషిస్తోంది. ‘సమోహం సర్వభూతేషు’ (గీత) సర్వుల ఎడల సముడైన పరమాత్మయందు భక్తులు పక్షపాతాన్ని పుట్టిస్తారు. ఏదో ఒక వ్యాజం నెపం పెట్టుకొని అవ్యాజ కరుణామూర్తి కృష్ణుడు తన ఏకాంత అనన్య భక్తులను ఉద్ధరిస్తాడు. ఇది ఆయనకు నైజం స్వభావం. ఇదీ భాగవత దర్శన రహస్యం!
శుకుడు రాజా! అనంతుని మాటలు విని అంతకుడు ‘ఇడిగో వీడె, తీసుకుపొండి’ అని చెంతకు రప్పించి గురు కుమారుని భక్తితో ఇచ్చివేశాడు. పన్నగ (కాళియ) మర్దనుడు, దుర్జన దమనుని పాపులను అణచేవానిని, మహిష గమనుని దున్నపై స్వారీ చేసేవాడు అయిన శమనుని యముని వీడ్కొని, గురు కుమారుని తోడ్కొని వచ్చి, సాందీపనికిచ్చి, ‘ఇంకా మీకు నచ్చిన ఏ పని చేసి చూపాలో చెప్పండి’ అని అన్నారు. సాందీపని ఎంతగానో మెచ్చి వారితో ఇలా ముచ్చటించాడు.
క॥ ‘గురునకు గోరిన దక్షిణ
గరుణన్ మున్నెవ్వడిచ్చె? ఘనులార! భవ
ద్గురునకు గోరిన దక్షిణ
దిరముగ నిచ్చితిరి మీరు దీపితయశులై’…
ధీరవరులారా! వీర కుమారులారా! గురువు కోరిన బరువైన కోరికను కరుణతో చిరు కానుకగా భావించి తెచ్చి ఇచ్చారు. లోకాలు అచ్చెరువొందే అరుదైన ఇలాంటి దక్షిణను గురువుకు సమర్పించిన వారు ఇంతవరకు ఒరులు ఇతరులు ఎవరైనా ఉన్నారా? మీ కీర్తిని దిగంతాలకు ప్రకాశింపజేశారు.
క॥ ‘కాలుని వీటికి జని మృత
బాలకు దేనొరుల వశమె? భవదీయ కృపన్
మేలు దొరకొనియె మాకు, వి
శాల మగుంగాత మీ యశము లోకములన్’
‘లోకపాలకులారా! కదన కుతూహలంతో కాలుని సదనానికి వెళ్లి ఈ విధంగా మృత బాలుని తెచ్చి ఇవ్వడం ఇతరులకు సాధ్యం కాదు కదా! జగాలనేలు కృపా విశాలురు మీరు. అపారమైన భక్తితో మాకు మేలు కలిగించారు. చాలు చాలు! మా ముద్దు మురిపాలన్నీ తీర్చారు. ఇక మాకు ఏ వరాలూ వద్దు. కల్యాణమూర్తులారా! మీ కీర్తి రాకాసుధాకర దీప్తి నిండు పున్నమి పండు వెన్నెల వలె లోకాలలో సదా మెండుగా వ్యాప్తి చెందుగాక! నేను ధన్యుడనయ్యాను’ అంటూ సాందీపని వారిని దీవించాడు. శుకుడు రాజా! గురువు వద్ద సెలవు పుచ్చుకొని కృతార్థులై రామకృష్ణులు రథారూఢులై తమ నెలవుకు మథురాపురికి వచ్చి శంఖం పూరించారు. తాము పోగొట్టుకొన్న ధనాన్ని తిరిగి పొందినట్లుగ పుర ప్రజలు ఆనందంగా విందులు చేసుకున్నారు.