సాహిత్యాభిలాషను విమర్శ బ్రతికించాలి (చెలిమె 10. 02. 25) శ్రీ రామ్ పుప్పాల వ్యాసం చదివాక అందులో నన్ను ప్రస్తావించడమే కాక నన్ను సమర్థించడానికే వంశీకృష్ణ గత వ్యాసం రాసాడని ఆరోపించడం సమంజసం కాదనిపించింది. అందుకే నావైన రెండు మాటలు చెప్పితీరాలనిపించింది. శ్రీరాం వ్యాసంలో చాలా చోట్ల తప్పులో కాలు వేశాడనిపించింది.
నన్ను సమర్థించడానికే వంశీ కృష్ణ వ్యాసం రాశాడని అనుకుంటే శ్రీరామ్ తన వ్యాసాన్ని అనిల్ డ్యానీని సమర్థించడానికి రాశాడని నేనూ అనొచ్చు. కానీ అనను. చెత్తను చెత్త అని అంటే తప్పేమిటి అని డ్యాని గురించి ఎవరో అడిగిన ప్రశ్న శ్రీరామ్‌కు తప్పుగా అనిపించడం వెనుక కూడా డ్యానీని సమర్థించడమే ఉందని నేననొచ్చు. కానీ అనను.
నీలిమ సరైన విమర్శే చేసిందని సాహిత్య ప్రపంచం అనుకోవాలని వంశీకృష్ణ తాపత్రయపడుతున్నాడు. అనడం కూడా పరోక్షంగా శ్రీరామ్ నన్ను అవమానించడమే. నీలిమ విమర్శ ఎక్కడ సరిగ్గా లేదో శ్రీరామే చాకిరేవు పెట్టొచ్చుకదా. ప్రసేన్ గురించో, నీలిమ గురించో ప్రస్తావించిన వ్యక్తి మాత్రం శ్రీరామ్‌కు అమూర్తంగా కనపడతాడు. సీరియస్ పాఠకుడెప్పుడూ అమూర్తంగానే వ్యాఖ్యానిస్తాడనే విషయం శ్రీరామ్‌కు తెలియకపోవడం ఆశ్చర్యమే.
వంశీ వ్యాసంలో నాకు సంబంధించని అనేక అంశాల ప్రస్తావన కూడా ఉంది. అవేమీ శ్రీరామ్‌కు కనపడలేదు. శ్రీరామ్‌కు కనపడని కొన్ని అంశాల గురించి నేనిక్కడ ప్రస్తావిస్తాను.
కవులకు ఇమేజ్ సమస్యలు ఉన్నాయేమో అని ఆయన వాపోవడం ఆశ్చర్యం వేసింది. ఆ పోలికే అసమంజసంగా వుంది. ఇమేజ్‌లు అభూత కల్పన కాదా అన్నది శ్రీరామ్ సందేహం.
నిజమే ఇమేజ్‌లు అభూత కల్పనలే. కానీ కవులకు అదే కావాలి కదా. ఆ ఇమేజ్ లేకపోతే శ్రీశ్రీ మహాకవి, శేషేంద్ర యుగకవి, తిలక్ అనుభూతి కవీ అయ్యే వాళ్లు కాదు కదా. యువకవుల పురోగమనాన్ని వాళ్లకున్న ఇమేజ్ దెబ్బతీస్తున్నదేమో అని వంశీకృష్ణ సందేహపడ్డాడు. అంతే తప్ప అందులో అసమంజసమేమీ లేదు.
‘ముందుమాటలు, బ్లర్బ్లు ఇలానే ఉండాలనే ఏ సూత్రీకరణ లేదు అంటూనే, వంశీ ఒకచోట పరిమితులు వున్నాయ్ అంటారు. మరొక చోట ఎక్కడా విమర్శ చేయకూడదని లేదు’ అంటారు అన్నాడు శ్రీరామ్.
నాకైతే ఇందులో గందరగోళం ఏమీ కనపడలేదు. ముందుమాటలు, బ్లర్బ్లు ఇలానే ఉండాలనే ఏ సూత్రీకరణ లేదు. ముందుతరం వాళ్లు ముందుమాటల్లోనే ఎక్కువ విమర్శ చేశారు. కానీ కొత్తతరం ముందు మాటల్లోకానీ, బ్లర్బ్లలో కానీ పొగడ్తలు తప్పిస్తే విమర్శ చేయడం లేదు. అదొక అప్రకటిత సంప్రదాయంగా మారింది. గత పాతికేళ్లలో దాన్నెవరూ బ్రేక్ చేయలేదు. ఆ అప్రకటిత సంప్రదాయాన్నే పరిమితి అని వంశీకృష్ణ అన్నాడు. ఏ సూత్రీకరణ లేదు అనటం ఆదర్శం. పరిమితులు వున్నాయ్ అనటం ఆ ఆదర్శ సాధనకై చేస్తున్న ఆచరణలో అనుసరిస్తున్న పరిమితి అనే విషయం శ్రీరామ్ అర్థం కాలేదా? కానట్టు నటిస్తున్నాడా?
రిజర్వేషన్ల తోడ్పాటు ఇప్పటికే కాదు, ఎప్పటికీ అవసరమేనని శ్రీరామ్ తెలుసుకోవాలి. దళిత, స్త్రీవాద, బహుజన, ముస్లిం, ఆదివాసీ కవిత్వ ఉద్యమాలు తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించి బాల్యావస్థను దాటి సొంత గొంతును, వ్యక్తిత్వాన్ని సాధించుకున్నాయి కనుక శేషం లక్ష్మీపతిరావు చెప్పిన మినహాయింపు అవసరం లేదు అని వంశీకృష్ణ భావన. ఆ మినహాయింపుల వెలుగులో వాటిని మూల్యాంకనం చేయరాదన్నది అతని అభిప్రాయం. తండ్రి చేయి పట్టుకుని కొంతకాలం మాత్రమే పిల్లాడు నడవాలి. దళిత, స్త్రీవాద, బహుజన, ముస్లిం, ఆదివాసీ కవిత్వం మీద సరైన విమర్శ రాలేదు అన్నది వంశీ అభిప్రాయం కాదు. శ్రీరామ్‌కి భిన్నమైన అభిప్రాయం ఉంటే అది స్వాగతించదగిందే.
‘కొత్త తరం రచయితలను ఉటంకిస్తూ వాళ్లందరూ ఏ నెగటివ్ విమర్శా చేయలేదంటారు. వంశీకృష్ణ మాత్రం ఏ నెగటివ్ విమర్శ చేసినట్టు భావించాలి?’ అని అడిగాడు శ్రీరామ్.
వంశీ చాల తక్కువ విమర్శ రాశాడు. ఆ రాసిన సందర్భాలలో కూడా చాలా మేరకు నెగటివ్ విమర్శ చేశాడు. తను చేసినవన్నీ ఎక్కువ పరిచయాలు, అవలోకనాలు. అవేవీ సీరియస్ సాహిత్య విమర్శ కాదు. ఇది అతని విమర్శ మీద నాకున్న అభిప్రాయం. ఇదే అభిప్రాయాన్ని పెద్దన్న చేసిన ఇంటర్వ్యూలో వంశీకృష్ణ స్వయంగా చెప్పుకున్నాడు కూడా. అఫ్సర్ డియర్ మేరీ కథను వంశీకృష్ణ విమర్శించాడు కదా. అమ్మ డైరీలో కొన్ని పేజీల లోపాన్ని వివరించాడు కదా. దేశరాజు కథలు, కే.జీ. వేణు కథలులో దృక్పథ లోపాలను చెప్పాడు కదా. ఇవి ఉదాహరణకి కొన్ని మాత్రమే. ఇంకా చాలా సందర్భాలలో వంశీకృష్ణ నెగటివ్‌గా రాశాడు.
‘వంశీకృష్ణ నీలిమను సమర్ధించడానికే ఈ వ్యాసం రాస్తే ఇబ్బంది లేదు. అనిల్ డ్యాని, లండ సాంబమూర్తి, నాంపల్లి సుజాతలను తక్కువ చేశారు’ అన్నది శ్రీరాం మరో ఆరోపణ. ఒకవేళ నిజంగానే నీలిమను సమర్థించడానికి వ్యాసం రాసి ఉంటే పైన చెప్పిన శ్రీరామ్ అభ్యంతరాలు అన్నీ మాఫీ అయిపోతాయా? అనిల్ డ్యాని ఎనిమిదో రంగు మీద తప్ప మిగతా పుస్తకాల మీద వంశీకృష్ణ ఏమీ రాయలేదు. లండ సాంబమూర్తి, నాంపల్లి సుజాతల గురించి కూడా రాయలేదు. నా వ్యాసాలకు వాళ్ల ప్రతిస్పందనలను తను ఉటంకించాడు. అంతే. వాటిని తనకు అర్థం అయిన రీతిలో ఇంటర్ప్రెట్ చేశాడు. శ్రీ రాం డ్యానీని సమర్థిస్తూ ఇంటర్ప్రెట్ చేసినట్టన్నమాట. ఇంటర్‌ప్రెటేషన్ తప్పయితే తప్పని చెప్పండి. అసలు ఇంటర్ప్రెటేషనే తక్కువ చేయడం అనే అభిప్రాయం మీకుంటే ఎవరూ ఏమీ చేయలేరు.
‘విమర్శా రంగాన్ని శుభ్రపరిచే వ్యాఖ్యలు చేయక్కరలేదు. ఇమేజ్ చట్రంలో చిక్కుకున్నారని కవులను నిందించనక్కర లేదు’ ఇది శ్రీరామ్ మరో వ్యాఖ్య.
ఒక వేళ వంశీ వ్యాఖ్యలు విమర్శా రంగాన్ని శుభ్రపరిచేలా ఉంటే, అది శ్రీరామ్‌కు నచ్చకపోతే ఆ పనేదో ఆయననే చేయమనండి. శ్రీరామ్ విమర్శా రంగాన్ని శుభ్రపరిచే వ్యాఖ్య లు చేయనక్కర లేదు అని ఎవరూ అనరు.
ఇమేజ్ అందరూ వద్దు అంటూనే కావాలనుకునే మాయా దర్పణం. అదేమీ నిందాపూర్వక పదం కాదు.
ఒక స్త్రీ ఏదైనా రాస్తే ఆమెను రాయనియ్యకపోవడం కొత్తేమీ కాదు. అందుకు అనుసరించే మార్గాలే కొత్త కొత్తవి. ఇప్పుడు నన్ను ఎవరో సమర్థిస్తున్నారనీ నారాతలు సరైనవేనని నిరూపించడానికి ఎవరో తాపత్రయపడుతున్నారనీ అనడం కూడా ఆ కొత్త పద్ధతుల్లో ఒకటి. అయినా నేను నాలానే రాస్తాను. ఆగను.