ఓ రోజు క్రీస్తు ఒక కొండపైకి బయలు దేరాడు. ఆయనతోపాటు ఆయన శిష్యుడు పేతురు ఉన్నాడు. అతనితోపాటు జేమ్స్, అతని సోదరుడు యోహాను కూడా ఉన్నారు. అది తాబూరు కొండ. చాలా ఎత్తుగా ఉంటుంది. ఇజ్రాయేలు దేశంలో గలెలియా దిగువన ఉంటుందది. ఆ ముగ్గురితో పాటు ప్రభువు.. ఆ పర్వతంపైకి చేరుకున్నాడు. ఆ తర్వాత ఓ సంఘటన జరిగింది. ప్రభువు ముఖం ఉన్నట్టుండి మహా తేజోవంతంగా ప్రకాశిస్తూ కనిపించింది. ఆ ముగ్గురు శిష్యులు చూస్తుండగానే ప్రభువు వస్ర్తాలు వెలుగులు విరజిమ్ముతూ తెల్లగా మారిపోయాయి.
ప్రభువు మాత్రమే కాదు.. ఆయన పక్కన గతంలో ఏనాడో పరమపదించిన మోషే కూడా కనిపించాడు. ఆయనతోపాటు ఏలియా మహాప్రవక్త కూడా మరో పక్క కనిపించాడు. కాంతులీనుతున్న వారిని చూడటానికి వీరికి శక్తి సరిపోవడం లేదు. గతంలో చనిపోయిన వారు, ప్రస్తుతం జీవిస్తున్నవాళ్లు ప్రభువును చూస్తున్నారన్నమాట ఈ దృశ్యంలో! దీనిని బట్టి భూత వర్తమానాలకు క్రీస్తు అతీతుడని, కర్త అని తెలుస్తున్నది. దీనికితోడు మేఘాల పొరల్లో నుంచి మరో అమర స్వరం ‘ఈయన నా ప్రియ కుమారుడు… ఈయన మాట ఆలకించండి’ అని పలికింది. ప్రభువు గురించి దైవ స్వరం వినబడడమనేది అది రెండోసారి. ఇది ఆయన ఎవరో మరోసారి ప్రకటించింది. క్రీస్తు లోకానికి ఏమవుతాడు? అమర లోకాన్నీ, ఈ అవనీ లోకాన్నీ కలపడానికి వచ్చిన దారి దీపమనీ, దైవ కుమారుడనీ ఇక్కడ స్పష్టంగా తెలిసింది.
-ప్రొ॥బెర్నార్డ్ రాజు ,98667 55024