గడప ముందు
ఎప్పట్నుంచి వేచుందో పైరగాలి
గొళ్ళెం తీసి తలుపులు తెరువంగానే
గప్పున వచ్చి అల్లేసుకుంది
అచ్చం.. ద్వీపాంతరవాసం
చేసొచ్చిన ప్రియున్ని
వేచివేచున్న ప్రేయసి అల్లుకున్నట్లే
నేనెటు తిరిగితే తానటే తిరుగుతూ
నన్ను పెనవేసుకుంటున్న ఆ తుంటరి గాలి
ఈ రాతిరికి ఇడిసిపోయేది లేదన్నట్లు
కావలికి తన చిలిపి స్నేహిత
వెన్నెలను వెంటేసుకొచ్చింది
తన స్పర్శ తాకితే చాలు
అందరూ మగత నిద్రలోకి జారుకుంటారు
నాకేమీ మాయరోగమో…
తానొచ్చి నాపై వాలితే చాలు
నిద్రెక్కడికో ఎగిరిపోయి
మెలకువలోనే కలలుకంటూ
ఊహా చిత్రాలు గీస్తుంటాను తన వీపు మీదే…
ఆ పూల వాసనలు అంతే…
నేరుగా నను తాకలేమనుకున్నపుడల్లా
తన వెంట వచ్చే సాకుతో నన్నల్లుకుని
వాటి కుతినవి తీర్చుకొని వెళ్తాయి
పైర గాలి బుంగమూతేసుకుంటుంది
తెలియకుండానే చేయని
తప్పునకు దోషిగా నిలబడి
తన కౌగిట సంకెళ్లలో
బందీగా బిత్తర చూపులు చూస్తాను
బారెడు పొద్దు నన్నాక్రమించుకుంటున్నపుడు
చిరాకుగా ఒళ్ళు దులుపుకుంటాను
నా మీద వాలి సేద తీరుతున్న పిల్లగాలి లేసి
చీ.. పో.. అంటూ కసురుకుంటుంది
వెళుతూ… వెళుతూ… విసుగ్గా నీ
ఒళ్ళుమండా అని తిడుతుంది
ఆపై.. లోనా.. బయటా..
ఒకటే ఉక్కపోతా… చికాకు…