యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః॥
(భగవద్గీత 2-46)
అన్ని వైపులా జలాలతో నిండి ఉన్న జలాశయాలు అందుబాటులో ఉన్నవాడికి చిన్న చిన్న జలాశాయల వల్ల ఎంత ప్రయోజనమో.. పరమానందకరుడైన పరమాత్మ ప్రాప్తి పొంది.. పరమానందాన్ని అనుభవించే బ్రహ్మజ్ఞానికి వేదాల వల్ల అంతే ఫలం. వేదం అంటే తెలుసుకోదగినది. తెలుసుకోవాలి అంటే పుస్తకాలు చదవాలి. పుస్తకాల అవసరం ఎంతవరకంటే?.. అందులోని జ్ఞానం అవగతం అయ్యేంత వరకు మాత్రమే. తరువాత.. పుస్తకంతో పనిలేదు. అలాగే బ్రహ్మజ్ఞానాన్ని సాధించాలి అంటే.. వేదమే మార్గం కాని, బ్రహ్మజ్ఞానం కలిగాక వేదంతో పనిలేదు.. అంటే వేదాన్ని నిరసించమని కాదు. ఆ పరిధిలోనే ఉండిపోకూడదని మాత్రమే. ఒక విషయంపై పరిశోధన చేయాలి అంటే అక్షరాలు అవసరం అవుతాయి. కాని అక్కడే ఆగిపోతే.. పరిశోధన దాకా సాగలేం.
‘అహం బ్రహ్మాస్మి‘ అంటుంది వేదం. ‘నేనే బ్రహ్మమును అయి ఉన్నాను’ అని. భగవంతుడి అంశగా భూమిపై జన్మించిన మనందరిలోనూ ఆ లక్షణాలన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని గుర్తించడం, వాటిని ఉపయోగించుకోవడంలో మనమంతా వెనుకబడి ఉన్నాం. నిజానికి మన అంతర్గత శక్తిసామర్థ్యాలు మనం పెంచుకున్న నైపుణ్యాల పరిధికన్నా చాలా ఎక్కువ. ప్రస్తుతం కొంతపని చేయగలుగుతున్నాం.. ఇంక కొంత ప్రయత్నిస్తే అంతకన్నా ఎక్కువ ఫలితాలను సాధించగలం. మరింత ప్రయత్నిస్తే.. మరింత ఎక్కువ ఫలితాన్ని పొందగలం. కాని మన సామర్ధ్యాన్ని అంచనా వేసుకోవడంలో విఫలమవడం వల్ల మన శక్తిసామర్థ్యాలను తక్కువ స్థాయిలో ఉపయోగించుకుంటున్నాం.
వ్యక్తి ఆలోచనా సరళే వారి జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది. ‘జపనీస్ కోయ్’ అనే చేప పుట్టినప్పుడు ఒకటి నుంచి ఒకటిన్నర అంగుళాల పొడుగు ఉంటుంది. దానిని చిన్న బకెట్లో వేస్తే అది దాని జీవితకాలంలో రెండు నుంచి మూడు అంగుళాలు పెరుగుతుంది. దానిని పెద్ద టబ్బులో వేస్తే తన జీవితకాలంలో ఆరు నుంచి ఎనిమిది అంగుళాలు పెరుగుతుంది. అదే చేపను చెరువులో వేస్తే.. తన జీవితకాలంలో మూడు అడుగుల వరకు పెరుగుతుంది. దానిపై పరిశోధన చేసిన శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం.. ఆ చేప తన పరిమితులను తానే నిర్ధారించుకుంటుందని. బకెట్లో వేసినప్పుడు అదే తన పరిధిగా భావించి అక్కడే పెరుగుదలను నియంత్రించుకుంది. అదే చెరువులో దాని పరిమితిని మరింత విస్తృతపరుచుకుంటుంది.
చేప ఎలాగైతే తన పరిమితులను తన ఆలోచనా పరిధిలో నిర్ధారించుకుంటుందో అలాగే మానవులూ తమ ఆలోచనల పరిధిలో అభ్యుదయాన్ని సాధిస్తారు. చేప ఆలోచనా పరిమితులు దాని భౌతిక ఎదుగుదలపై ప్రభావాన్ని చూపుతాయి.. అదే మానవుల ఆలోచనా పరిమితులు వారి మేధ, భావోద్వేగాలపై ప్రభావాన్ని చూపుతాయి. కుత్సితమై, కుంచించుకుపోయిన ఆలోచనల పరిధులను, పరిమితులను చెరిపివేసుకొని విస్తృతపరిధిలో ఆలోచించగలిగిన వ్యక్తి పరిణతికి, అభ్యుదయానికి ఆకాశమే హద్దు. మేధ, భౌతిక శరీరం.. రెండూ పరిమితులకు లోబడినవే అనుకున్నా.. ఆత్మపరంగా ప్రతివ్యక్తీ అనంతత్వానికి చెందినవాడే. కాకపోతే జీవితమనేది పరిమితత్వానికి అపరిమితత్వానికి మధ్య ఊగీసలాడుతూ ఉంటుంది.
యోగమైనా భోగమైనా.. బంధనాలైనా, స్వేచ్ఛ అయినా మానసికమైనవే! వాటిని గుర్తించి.. ఆ పరిమితులను చెరిపివేసుకోగలిగితే.. ఒక స్టీఫన్ హాకింగ్ కావచ్చు.. హెలెన్ కిల్లర్ కావచ్చు.. ఆల్వా ఎడిసెన్ కావచ్చు. నిజానికి వీరందరికీ పరిమితులు ఉన్నాయి. కాని వారు ఆ పరిమితులను అధిగమించి అపరిమితత్వాన్ని చేరుకోగలిగారు. మనమంతా మన ఆలోచనా పరిమితుల కన్నా ఎన్నో రెట్లు అధికమైన శక్తిసామర్థ్యాలు కలిగిన వారమే. యువత ఈ విషయాన్ని గుర్తించి తమ పరిమితులను, పరిధులను చెరిపివేసుకుంటే.. నవ సమాజం ఆవిష్కృతమవుతుంది.