మహాభారత యుద్ధం జరిగింది దక్షిణాయనంలో. ఉత్తరాయణంలో మరణించిన వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని శాస్త్రవచనం. అందువల్ల దక్షిణాయనంలో శరతల్పగతుడైన భీష్ముడు ఇచ్ఛామరణ వరప్రసాదుడు. కాబట్టి, ఉత్తరాయణం ప్రవేశించే వరకు 58 రోజులు వేచి చూసి మాఘ శుక్ల అష్టమి నాడు యోగ విశేషంతో సమాధిలోకి వెళ్లాడు. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో దేహ త్యాగం చేసి పరలోక గతుడై తన పూర్వరూపమైన వసువులలో కలిసి పోయాడు. అందుకే దీనికి భీష్మాష్టమి అనే పేరు వచ్చింది.
వసిష్ఠ మహర్షి శాపానికి గురైన అష్ట వసువులలో చివరివాడైన ప్రభాసుడు ఈ లోకంలో గంగా శంతనుల కుమారుడిగా భీష్ముడు జన్మించాడు. ఆయన అసలుపేరు దేవవ్రతుడు. తర్వాత కాలంలో కారణాంతరాల వల్ల గంగ వెళ్లిపోతుంది. దీంతో శంతనుడు సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు, సత్యవతి తండ్రి షరతుల మేరకు తాను వివాహం చేసుకోనని, ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతానని దేవవ్రతుడు భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. అలా ఆయన ‘భీష్ముడు‘గా ప్రసిద్ధిచెందాడు. కుమారుడి త్యాగానికి శంతనుడు సంతోషిస్తాడు. తాను కోరుకున్నప్పుడు మరణం సంభవించగల వరాన్ని అనుగ్రహిస్తాడు. ఈ కారణంగానే భీష్ముడు మాఘ శుక్ల అష్టమి రోజు ప్రాణాలు వదిలిపెట్టాడు. అందువల్ల ఈ తిథిని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.
పద్దెనిమిది పర్వాలు గల మహాభారతంలో శాంతి, ఆనుశాసనిక పర్వాలు అత్యంత ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న పదోనాడు తనను ఎలా ఓడించాలో భీష్ముడు స్వయంగా ధర్మరాజుకు తెలుపుతాడు. మర్నాడు అర్జునుడి బాణాలకు గాయపడి అంపశయ్యపై ఉండిపోతాడు. ఉత్తరాయణ ఆగమనానికి నిరీక్షిస్తూ ఉంటాడు. అదే సమయంలో యుద్ధంలో బంధువులను, జ్ఞాతులను కోల్పోయి వైరాగ్యంతో ఉన్న ధర్మరాజు, తనకు రక్తపు కూడు వంటి ఈ రాజ్య పరిపాలన వద్దని, తాను అడవులకు వెళ్లి తపస్సుతో పాపప్రక్షాళన చేసుకుంటానని శ్రీకృష్ణాదులకు వెల్లడిస్తాడు. అందుకు వారంతా ఆయనను నివారించి పట్టాభిషిక్తుణ్ని చేస్తారు. అప్పుడు తన పాలనకు అవసరమైన ధర్మమార్గాలను ఉపదేశించాల్సిందిగా శ్రీకృష్ణుడు, మహర్షులు మొదలైన వారిని ధర్మజుడు కోరతాడు. అందుకు తగిన వ్యక్తి భీష్ముడేనని శ్రీకృష్ణుడు నిశ్చయించుకుంటాడు. ఓఘవతీ నదీ తీరంలో అంపశయ్యపై ఉన్న భీష్ముని దగ్గరికి ధర్మజాదులను తీసుకువెళ్తాడు. పితామహుడు వారితో చేసిన ఉపదేశమంతా ఈ రెండు పర్వాలలోనే ఉన్నది.
తాత గారైన భీష్ముడు ఈ స్థితిలో ఉండటానికి కారణం తానేననే భయంతో ఆయన దగ్గరికి వెళ్లడానికి ధర్మరాజు వణికిపోయాడు. అప్పుడు ధర్మరాజుకు స్వయంగా భీష్ముడే ధైర్యవచనాలు చెబుతాడు. ధర్మద్రోహుల పక్షం వహించిన తనలాంటి వారందరికి శిక్షపడవలసిందేనని, అధర్మం వైపు నిలిచిన వారికి పరిపాలకుడు సరియైన శిక్షలు విధించాలని ప్రబోధిస్తాడు. ప్రజలు ఆచరించ వలసిన ధర్మాలు, సాంఖ్యాది యోగాలు, పురాణేతిహాసాలు, ధర్మశాస్త్ర విషయాలు, లోక వ్యవహారాలు వంటి అంశాల గురించి ధర్మరాజు అడిగిన సుమారు 220 వరకు ప్రశ్నలకు పితామహుడు అనేక ఉపకథలతో సమాధానాలు ఇస్తాడు. ఈ సంభాషణ ముప్పై రోజులపాటు సాగుతుంది. మహిమాన్వితమైన శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం కూడా ఇందులో భాగం కావడం విశేషం.
భీష్ముడు పరమపదం పొందింది మాఘ శుక్ల అష్టమి అయినా, మాఘ శుక్ల ద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను ‘భీష్మ పంచకం’ అంటారు. వీటిలో ఏకాదశి శ్రేష్ఠమైంది. దీన్నే ‘భీష్మ ఏకాదశి’ అంటారు. ఈ రోజు భీష్ముని స్మరిస్తూ భారతీయులు ఆ మహనీయుడికి తర్పణాలు వదలడం సంప్రదాయం. ఈ ఏకాదశిని పుణ్యదినంగా భావించి ఆ మహాత్ముని భక్తిశ్రద్ధలతో స్మరించుకొంటారు. అంతేకాకుండా ఈ రోజును శ్రీవిష్ణు సహస్రనామ జయంతిగా కూడా ఆచరిస్తారు.
– డా॥ కండ్లకుంట నరసింహమూర్తి 94401 60035