భగవద్గీత నాగరిక మానవులకు లభించిన అద్వితీయ వరదానం. అది మానవ సమాజంలో ఇరవై లక్షల ఏండ్లుగా వ్యాప్తిలో ఉన్నట్లు గీత ద్వారా తెలుస్తున్నది. అయితే, కాలక్రమంలో ప్రాచుర్యం తగ్గినట్లు అనిపించడంతో శ్రీకృష్ణ భగవానుడు తిరిగి దానిని ఐదువేల సంవత్సరాల కిందట కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి తెలియజేశాడు. అర్జునుడి నిమిత్తంగా అది మళ్లీ భువిలోకి వ్యాపించింది. మానసిక స్థితిలో మనిషి నిశ్చయంగా బలహీనుడే అవుతాడు. కాబట్టి అతడు మానసికస్థితిలో కూరుకుపోకుండా కాపాడి ఆత్మస్థితిలో నిలిపేదే భగవద్గీత. అతనిలో ఆత్మశక్తిని నింపడమే భగవద్గీత ఉద్దేశం. అందుకే గీతను ఆత్మశక్తిని ఉద్దీపితం చేసే గ్రంథంగా, సందేశంగా స్వీకరించిన రోజున సమస్త శుభాలు మానవుడికి కలుగుతాయి.
యుద్ధం వల్ల కలిగే పరిణామాలను అర్జునుడు మొదటి అధ్యాయంలోనే వివరిస్త్తూ కులక్షయం తీవ్ర నష్టంగా పరిణమిస్తుందని అన్నాడు. కులక్షయం ద్వారా వంశాచారాలు నశించిపోతాయి. ఫలితంగా ధర్మం అడుగంటుతుంది. అప్పుడు ప్రథమంగా నష్టపోయేవారు స్త్రీలే! పురుషాధిక్య సమాజంలో అతివకు రక్షణ కరువవుతుంది. యుద్ధ పరిణామాల వల్ల స్త్రీలు తీవ్ర ఇక్కట్లకు గురవుతారని అర్జునుడు వాదం చేస్తాడు. అయితే, అర్జునుడి యుద్ధ విరమణ నిర్ణయం మానసిక స్థితిలో తీసుకున్నదని గ్రహించిన శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైన గీతను ఉద్బోధిస్తూ ఆత్మతత్వాన్ని తెలియజేశాడు. అందులో భాగంగా పదో అధ్యాయంలో తన దివ్య విభూతులను వర్ణిస్తూ స్త్రీలలో ఉండే ఏడు దివ్యగుణాలు తన ప్రత్యేక విభూతులని తెలియజేశాడు.
స్త్రీలలోని యశస్సు, ఐశ్వర్యం (సౌందర్యం), మనోహరమైన వాక్కు, జ్ఞాపకశక్తి, బుద్ధి, దృఢత్వము, ఓర్పు నేనే” (భగవద్గీత 10.34) అని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. శారీరక, మానసిక, బుద్ధిపరమైన స్థాయులలో మనిషి వివిధ శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నప్పటికీ, ఆత్మస్థాయిలో స్త్రీ, పురుషుల శక్తిసామర్థ్యాలు సమానంగానే ఉంటాయి. ఆత్మస్థితికి చేరిన మహిళ అయినా, పురుషుడు అయినా ఎంతటి స్థాయికైనా చేరుకుంటారు. ఇక స్త్రీలకు ప్రత్యేకంగా ఏడు దివ్యగుణాలు ఉన్నాయి, అవి నిజానికి తానేనని (తన విభూతులేనని) పలికాడు శ్రీకృష్ణుడు. ఈ ఏడు దివ్యగుణాలతో శోభితులైన స్త్రీలు నిశ్చయంగా సురక్షితులవుతారు. ఎందుకంటే ఆ గుణాలు స్వయంగా శ్రీకృష్ణభగవానుడే కాబట్టి!
సీతమ్మతల్లి నుంచి రుద్రమదేవి వరకు ఎందరో మహిళా మణులు స్త్రీ శక్తిని, సహనాన్ని లోకానికి చాటిచెప్పారు. చరిత్ర సృష్టించిన స్త్రీమూర్తులను లోకం ఎన్నటికీ మరచిపోదు. వారి యశస్సే అటువంటిది. స్త్రీలకు ఉండే జ్ఞాపకశక్తి, బుద్ధి, దృఢత్వం అందరికీ చిరపరిచితమే. ఇక ఓర్పునకు నిలువెత్తు రూపం మహిళ. బిడ్డకు జన్మనివ్వడానికి ఆమె పడే కష్టాన్ని దేనితోనూ పోల్చలేం. బిడ్డను ఉన్నతుడిగా తీర్చిదిద్దడానికి అమ్మ పడే ఆరాటం ఆమె మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. నిజానికి ఈ గుణాలన్నీ సాక్షాత్తుగా శ్రీకృష్ణుడి విభూతులే. భగవంతుడు పలికిన ఏడు గుణాలలో కొన్నింటినైనా ఆచరించగలిగితే మహిళలు సంపూర్ణ ఆదరణను పొందగలుగుతారు. భగవద్గీత నిజానికి జీవితంలో సంపూర్ణ విజయాన్ని అందుకోవాలని తెలియజేస్తుంది. జీవితంలో కొండంత బలాన్ని పొందడానికి స్త్రీలు అన్ని జీవనస్థితులలో, అన్ని లక్ష్యాల సాధనలో భగవద్గీత చెప్పిన దివ్యగుణాలను పుణికిపుచ్చుకొని తద్వారా సంపూర్ణ రక్షణ పొందుదురు గాక!
డా॥ వైష్ణవాంఘ్రి సేవక దాస్