యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే!
(భగవద్గీత 4-22)
తాను ఆశించకుండానే లభించిన దానితో అంటే.. అప్రయత్నంగా లభించిన లాభంతో సంతుష్టి చెందినవాడు, అసూయ లేనివాడు, సంతోషం, దుఃఖాలకు అతీతుడు, చేస్తున్న పనిలో ఫలితం లభించినా లభించకున్నా సమభావన కలిగి ఉంటాడు. చేసేపని ఇతరులకు ఉపయోగపడాలని, తనకు యోగించాలనే సంకల్పంతో.. పనిని ఉపాసనా మార్గంగా భావిస్తూ.. కోరికలు లేకుండా నిరంతరం శ్రమించేవాడు కర్మయోగి. తద్వారా లభించింది యదృచ్ఛాలాభం. అలాంటి కర్మయోగులు బంధాలలో చిక్కుకోరు, అంటున్నాడు కృష్ణపరమాత్మ.
ప్రతివ్యక్తి తన జీవనోపాధికై ఏదో పని చేయాల్సిందే. తాను చేసే పని తనకు మేలుచేస్తూ.. ఇతరులకు ఉపయుక్తమైతే దానిని సత్కర్మగానూ, హానికరమైతే దుష్కర్మగానూ చెబుతారు. పనిచేస్తేనే లాభమో నష్టమో వస్తుంది. ఎవరైతే పనిని ప్రేమిస్తారో వారు లాభనష్టాలను పట్టించుకోకుండా ఆ పనిలో ఆనందాన్ని అనుభవిస్తారు. సంకల్పించిన కార్యం సాకారం కావాలంటే.. పురుష ప్రయత్నం కావాలి. దైవం అనుకూలించాలి. చేసే పనిలో ఆశించిన దానికన్నా అధిక ఫలితం వస్తే పొంగిపోవడం.. లేకపోతే కుంగిపోవడం సాధారణ వ్యక్తుల లక్షణం.
ఒకసారి మానసికంగా వ్యక్తి పరిణతి సాధిస్తే, విస్తరిస్తే.. చేసేపనిలో సాఫల్యమైనా, విఫలమైనా అది దైవ నిర్ణయంగా భావించి ప్రశాంత చిత్తంతో, ప్రసన్నంగా ఆనందిస్తాడు. స్థితప్రజ్ఞత సాధిస్తాడు. అలాంటి వ్యక్తులు పనిని అత్యంత ముఖ్యమైన ప్రేరణగా భావిస్తారు. నిజానికి మనమీ భూమిపైకి రాకముందే ఎందరో భూమిపై అవతరించారు. వారు సాధనలో పొందిన జ్ఞానాన్ని, అనుభవాన్ని భావితరాలకు అందించే కార్యాన్ని నిర్వహించారు. దానిని అందిపుచ్చుకొని ముందుకు సాగడమే వర్తమాన సమాజం చేయాల్సింది. దృఢమైన సంకల్పం, నిరంతర కృషి ఆయుధాలుగా కార్యరంగంలో ముందుకు సాగే వ్యక్తిని అపజయం పలకరించేందుకు సాహసించదు. పలకరించినా ఆ వ్యక్తిలో కుంగుబాటు తొంగిచూడదు.
విమత్సరః అంటున్నాడు, కృష్ణ పరమాత్మ. మాత్సర్యం లేకుండా ఉండటం. మాత్సర్యం పొందేందుకు కారణం ఏమిటి? ఫలితంపై అనురాగం పెంచుకోవడమే! తాను సాధించని ఫలితాన్ని వేరెవరో సాధించడం వల్ల వారిపై అసూయ, తద్వారా మాత్సర్యం కలుగుతుంది. పరస్పరాధారిత సమాజంలో ఒకరికొకరు తోడ్పడటం వల్ల ఇరువురూ అభివృద్ధిని సాధిస్తారు. స్వార్థపరత పెల్లుబ్బగా ఇతరుల విజయావకాశాలను దెబ్బతీసేందుకు నిరంతరం శ్రమించేవారికి మానసిక శాంతి కొరవడుతుంది. పనిలో సిద్ధి, అసిద్ధి అంటున్నాడు, పరమాత్మ. చేస్తున్న పనికి ఆటంకాలు ఎదురవకుండా నిర్విఘ్నంగా పరిసమాప్తమవడం సిద్ధి. అలా కాకపోవడం ‘అసిద్ధి’. నిర్ణీత గమ్యాన్ని చేరాలనే లక్ష్యం పట్ల సరైన అవగాహన కలిగి ప్రక్రియ ఆధారంగా కార్యాన్ని నిర్వహించే కర్మయోగికి దైవం తోడ్పడుతుంది. ఒకవేళ సిద్ధించకపోయినా ఒత్తిడికి లోనుగాడు. కార్య విఫలతకు లోపం ఎక్కడో సమీక్షించుకొని తిరిగి ఉత్సాహంతో ఉద్యమిస్తాడు. ఏ విధమైన వికారాలకు.. అంటే కార్య సాఫల్యతలో హర్షం, కార్యం భగ్నమైతే విచారం చోటుచేసుకోదు. అలాంటి వారు కర్మబంధాలలో చిక్కుకోరు.
బాధ్యత అప్పగించిన వేళ ఆ కార్య నిర్వహణలో వివిధ మనస్తత్వాల వ్యక్తులను కలవాల్సి ఉంటుంది. భావాలను పంచుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియలో ఎదుటివారి నుండి ఎన్నో ఆటంకాలు, ఎదురుదెబ్బలు తగలవచ్చు. అసంతృప్తీ పలకరించ వచ్చు. ఆలోచనలు దారి మళ్లనూవచ్చు. ఇతరుల గురించి సదవగాహనను పెంచుకున్న వ్యక్తి విజ్ఞునిగా ప్రవర్తిస్తాడు. తన సమర్ధతపై విశ్వాసం, పరమాత్మపై విశ్వాసం ఉత్సాహాన్ని నింపుతుంది. తాను గెలవాలని గాక సమష్టిగా విజయం సాధించాలని ఉద్యమిస్తాడు. ప్రేమలేకుండా రొట్టె తయారుచేస్తే అది ఎదుటివారి ఆకలిని సగమే తీరుస్తుందనేది సామెత. హృదయంతో పరిశ్రమించలేని వ్యక్తి విజయం సమగ్రతను సంతరించుకోదు. సహేతుకమైన ప్రవర్తన కలిగిన వ్యక్తులు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు.
కార్య నిర్వహణలో తప్పులు జరగవచ్చు. దానితో ఆశించిన ఫలితాలు జాప్యం కావచ్చు. అయితే దార్శనికులైన నాయకులు తప్పులు ఎక్కడ జరగవచ్చో ముందే ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ అనుకోకుండా తప్పులు జరిగితే.. ఆ తప్పులను సృజనాత్మక ఆలోచనా సరళితో అవకాశాలుగా మలుచుకొని తిరిగి ప్రయత్నిస్తారు. విజయం సాధిస్తారు. విజయంలో అందరినీ భాగస్వాములను చేస్తారే కానీ, స్వార్థభావనకు లోనుగారు, అంటున్నాడు పరమాత్మ.
– పాలకుర్తి రామమూర్తి