యాంతి దేవవ్రతా దేవాన్, పితౄన్ యాంతి పితృవ్రతాః
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోపి మామ్
(భగవద్గీత – 9-25)
దేవతలను పూజించేవారు దేవలోకాలకు, పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకాలకు వెళ్తారు. అలాగే భూతప్రేతాలను అర్చించే వారు ఆ రూపాలను పొందుతారు.. కాని, నన్ను ఉపాసించు భక్తులు నన్నే పొందుతారు. అలాంటి భక్తులకు పునర్జన్మ ఉండదు, అంటాడు కృష్ణ పరమాత్మ. ఒక వ్యక్తి ధారాళంగా గాలి వెలుతురూ వస్తూ ఆహ్లాదకరమైన, మనోరంజకమైన వాతావరణంలో నివసించాలి అనుకుంటే.. దానికి తగిన ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. ఎత్తయిన ప్రదేశంలో ఇల్లును నిర్మించుకొని, ఇంటి చుట్టూ తోటలను పెంచుకోవాలి. దుర్వాసనలు రాకుండా పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలి. అంతేకాని అపరిశుభ్ర వాతావరణంలో చెట్లుచేమలు లేకుండా ఇంటిని నిర్మించుకొని సువాసనలు రావాలంటే సాధ్యపడదు. అలాగే మనం దేనిని కోరుకుంటామో దానికి తగిన పరిశ్రమ చేయాలి. మనసులో స్పష్టత ఉండాలి. తీవ్రమైన తపనతో మనసు రగిలిపోవాలి. దానిని సాధించేందుకు నిరంతరం కృషిచేయాలి. మామిడి చెట్టు నాటి అరటికాయలు కోరుకుంటే సాధ్యపడదు. నిజానికి ఉన్నది ఒక్కటే.. పరమాత్మ తత్వం. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క భావనతో దానిని దర్శించి ఉపాసించి ఆ స్థానాన్ని పొందుతారు. అయితే ఎవరు ఏ రూపంలో ఆరాధించినా చేరేది పంచభూతాత్మకమైన పరమాత్మనే.. కాకపోతే భగవంతుడి అంతర్యామిత్వమును దర్శించి సమర్పణ భావనతో ఉపాసించే వారికి పునర్జన్మ ఉండదని భగవానుడు చెబుతున్నాడు.
ఒకదారి మననొక లక్ష్యానికి చేరుస్తుంది. ఎన్నిమార్లు ఆ దారిలో నడిచినా ఆ ఫలితాలే పునరావృతం అవుతాయి. అలవాటైన, సౌకర్యవంతమైన వలయంగా భావించి ఆ దారిని విడవలేనివారు ఆ ఫలితాలే అంతిమమనే భావనకు పరిమితమవుతారు. పరిమితత్వం అపరిమితత్వాన్ని చేరుకోలేదు. కొత్తదారిని అన్వేషించిన వారు కొత్త లక్ష్యాన్ని చేరుకుంటారు. అందులో సమస్యలు ఎదురుకావచ్చు.. అపజయాలు పలకరించవచ్చు. కాని ప్రయత్నలోపం లేకుండా ముందుకు సాగినవారు జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. వ్యక్తిగతంగా పరిణతి సాధిస్తే కుటుంబం, తద్వారా సమాజం ఉన్నతి చెందుతుంది.
ప్రతివ్యక్తి జీవితానికీ ఒక ప్రయోజనం ఉంటుంది. ఇష్టాయిష్టాలు ఆ ప్రయోజనానికి అనుబంధంగా పనిచేయాలే కాని, ప్రయోజనం ఇష్టాయిష్టాలను అనుసరించకూడదు. భ్రమరకీట న్యాయాన్ని అనుసరించి వ్యక్తి త్రికరణశుద్ధిగా ఏ ప్రయోజనాన్ని భావనచేస్తూ, ఉపాసిస్తాడో ఆ వ్యక్తి ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు. ఏర్పరుచుకున్న లక్ష్యంపై దృష్టిని కేంద్రీకరించి అహర్నిశలు అంకితభావంతో ప్రయత్నించడం వల్ల ఆ సంకల్పం సాకారమవుతుంది. నిజానికి మనం చేసే ప్రయత్నమే మన ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అయితే మనలో చాలామంది జరిగిపోయిన దానికి చింతిస్తూనో.. భవితపై ఊహాసౌధాలు నిర్మించుకుంటూనో వర్తమానాన్ని విస్మరిస్తుంటారు. ఎప్పటిదాకా వారు ఆ భావనలకు అతుక్కుపోతారో వారి ఆలోచనా పరిధి దానికి పరిమితం అవుతుంది. సాధారణంగా మనందరం కొంత పనిని చేయగలమని నమ్ముతాం. కాని అవసరమైన సమయంలో దానికి మించి చేయగలుగుతాం. అయితే దానికన్నా ఎన్నో రెట్ల సామర్థ్యం మనలో ఉన్నదనే సత్యాన్ని విస్మరిస్తాం. పరిమితుల పరిధులను చెరిపివేసుకోగలిగితే అభ్యుదయమనే ఆకాశాన్ని అధిగమించగలం. అలాగే ఇతరులపై విమర్శలు చేయడం, దోషారోపణలు చేయడం, తప్పులెంచడం వల్ల మనసు దానికే పరిమితమై ఉన్నతస్థితిని చూడటానికి సన్నద్ధం కాలేదని అర్థం. మనలోకి ఏదీ బాహిరంగా రాదు.. ఏదైనా సరే అంతరంగంలో నుంచి వస్తుంది. దానిని పరిశుద్ధంగా ఉంచుకుంటే పరమాత్మకు ఆవాసం అవుతుంది.
అపరిమితమైన భగవత్తత్వంలో జీవించాల్సిన మనం, పరిమితమైన భౌతిక సుఖాలవైపు ఆకర్షితులం అవుతున్నాం. భౌతికంగా సాధించినది భౌతికానికే పరిమితం.. దానికి అతీతమైన భావనతో జీవించగలిగిన వ్యక్తులు జీవితాన్ని ఆస్వాదించ గలుగుతారు. తాము శాశ్వతమైన భగవత్తత్వానికి ప్రతీకలమనే భావనతో తమ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోగలుగుతారు. భగవంతుడనే అనంతత్వంలో లయమవుతారు.