యః సర్వత్రా నభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥
(భగవద్గీత – 2-57)
‘దేనియందూ మమతాసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల యందు సంతోషం, ప్రతికూల పరిస్థితుల యందు దుఃఖం లాంటి వికారాలకు లోనుగానివాడే స్థితప్రజ్ఞుడు’ అంటున్నాడు కృష్ణపరమాత్మ. జీవిత గమనంలో ఎదురయ్యే ఎలాంటి పరీక్షలనైనా తట్టుకోగలిగే శక్తిసామర్థ్యాలు, సమస్యలను అధిగమించే బుద్ధి సంపద, దేనికోసం దేనిని ఆదరించాలనే విచక్షణతో కూడిన స్వేచ్ఛ.. స్థితప్రజ్ఞునిలో సహజ లక్షణాలుగా ప్రకాశిస్తాయి. సృష్టిలో ద్వంద్వాలు సహజాలు. అలాగే ఒక పనిని చేస్తున్నప్పుడు లాభనష్టాలు, జయాపజయాలు కలుగుతాయి. శుభమైనా అశుభమైనా.. మంచైనా చెడైనా అవి మనసులో వెలుగు చూసే అభిప్రాయాలే కాని బాహ్య సన్నివేశాలు కావు. పుస్తకంలో వర్ణించిన నవరస భరిత సన్నివేశాలు ఎలాగైతే పుస్తకానికి అంటుకుపోవో అలాగే శుభాశుభాలు స్థితప్రజ్ఞునికి అంటుకోవు. ఒకరంగు పాత్రలో పోసిన నీరు మరొకరంగు పాత్రలో పోసిన నీటికి భిన్నంగా కనిపించినా రెండిటిలో ఉన్నది ఒకే నీరనే భావన స్థితప్రజ్ఞుడు పొందగలుగుతాడు.
రెండూ భిన్నమనే భావనే సంఘర్షణకు దారితీస్తుంది. అలాంటి సంఘర్షణలో కూడా సానుకూలతను అన్వేషించడమే స్థితప్రజ్ఞత. యుద్ధవిద్యలో ఎదుటి వ్యక్తి దాడి చేసిన సమయంలో ముందుగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అలవరచుకోవాలని నిపుణులు చెబుతారు. ప్రశాంత స్థితిని పొందిన మనసును యథేచ్ఛగా వదిలివేస్తే .. అది పరిష్కారం దిశగా సాగుతుంది. ప్రశాంతత జీవన కేంద్రమై, ఆలోచన ఉత్తేజితం అవుతుంది. కర్తవ్యం బోధపడుతుంది. ఎక్కువలో ఎక్కువగా ఏమవుతుంది? ఎదుటి వ్యక్తి బలవంతుడైతే మనలను చంపేయవచ్చు. పెనుగులాడినా అదెలాగూ జరుగుతుంది. ప్రశాంతతను ఆదరిస్తే.. ప్రమాదం నుంచి బయటపడే పరిష్కారం స్ఫురించవచ్చు. ప్రశాంతమైన మనసును దేనిపై లగ్నం చేస్తే దానినే సాకారం చేస్తుందది. మనసును వదిలివేస్తే అది పసిపాపలా అన్నిటినీ అద్భుతాలుగా భావిస్తుంది.. ఆస్వాదిస్తుంది. పసిపిల్లల మనసులో భేద భావనలు నిలువవు. గతం పట్ల విచారం కానీ భవిష్యత్తు పట్ల ఆందోళన కానీ ఉండవు. వర్తమానాన్ని ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు. సగటున పసిపిల్లలు రోజుకు మూడు వందల సార్లు నవ్వుతారని చెబుతారు.
ప్రశాంతమైన మనసుతో సముద్ర తరంగాలపై విహరించే వ్యక్తి ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ.. తరంగాలు పైకి లేపిన వేళ పూర్తి స్పృహతో, తెలివితో దానికి అనుకూలంగా స్పందిస్తాడు.. పడిపోయినా ‘ఎరుక‘తో పడిపోతాడు.. పడిలేవడాన్ని సమచిత్తంతో ఆహ్వానిస్తాడు.. ఆనందిస్తాడు.. అద్భుతంగా భావిస్తాడు.. ఆస్వాదిస్తాడు. ఇక్కడ ‘పడటం’ అనేది సమస్యగా భావిస్తే.. జయాపజయాలకు అతుక్కుపోతాడు.. దానితో ఒత్తిడి పెరుగుతుంది. నిరాశా, నిస్పృహలు పెరిగిపోయి.. మనసును సంఘర్షణకు గురిచేస్తాయి. అలాకాక వాటిని సహజంగా భావిస్తే స్థితప్రజ్ఞతను ప్రదర్శిస్తాడు. సమస్య నుంచి పారిపోవడం కాక దానిని ఎలా ఎదిరించాలో ఆలోచిస్తూ.. సానుకూలతను ఆదరిస్తే సంఘర్షణను అధిగమించడం సాధ్యపడుతుందని కృష్ణపరమాత్మ బోధిస్తున్నాడు.
దానిని సాధించడం ఎలా? ప్రశాంతమైన మనసుతో.. సమస్య పట్ల అవగాహనను పెంచుకుంటే.. అంతర్ మనసు పరిష్కార మార్గాన్ని అందిస్తుంది. కానీ చాలామంది పరిష్కారంలో భాగంగా కాక సమస్యలో భాగమవుతుంటారు. అదే సంఘర్షణను పెంచుతుంది. రెండావులను అడిగి ద్రుపదునితో అవమానం పొందిన ద్రోణుడిలోని సంఘర్షణ అతనిపై ప్రతీకారానికి ప్రేరణనిచ్చింది. తద్వారా ద్రుపదునిలో వెలుగుచూచిన సంఘర్షణ ద్రోణవధ లక్ష్యంగా దృష్టద్యుమ్నునికి జన్మనిచ్చింది. అస్త్రవిద్యా ప్రదర్శనలో అవమానం ఎదుర్కొన్న కర్ణుడు, అర్జునుడిపై పెంచుకున్న మాత్సర్యం అతణ్ని జీవితాంతం సంఘర్షణకు లోనుచేసింది. కర్ణుడి పరాక్రమాన్ని తలుచుకొని ధర్మరాజూ సంఘర్షణకు లోనయ్యాడు.. దానికి ప్రతిగా వారు సానుకూల వైఖరితో ఆలోచించి ఉంటే ఫలితం వేరుగా ఉండేది.