ముహమ్మద్ ప్రవక్త (స) కాలంలో ఉహుద్ అనే యుద్ధం జరిగింది. ఈ సమరంలో హమ్జా అనే విశ్వాసిని చంపాలని అబూ సుఫ్యాన్ అనే ఇస్లామ్ శత్రువు భార్య హిందా కుట్ర పన్నింది. అనుకున్నట్లుగానే యుద్ధంలో హమ్జాను హతమారిస్తే బానిసత్వం నుంచి విడిపిస్తాననీ, తన కంఠహారం ఇస్తాననీ వహ్ షీ అనే తన బానిసను ఉసిగొల్పిందామె. వహ్ షీ యుద్ధరంగంలో దిగాడు. హమ్జా కోసం మాటువేశాడు. దొంగ చాటుగా బల్లెం విసిరాడు. అది హమ్జా పొట్టలో దూసుకుపోయింది. దాంతో ఆయన అక్కడికక్కడే కూలిపోయారు. అప్పుడు వహ్ షీ ఆనందంతో కేరింతలు కొడుతూ పరుగు పరుగున హిందాకు కబురందించాడు. ‘నీకు కంఠహారం ఇస్తాగాని ముందు ఆ హమ్జా మృతదేహం ఎక్కడుందో చూపించు’ అన్నది హిందా. అప్పుడు వహ్ షీ ఆమెను వెంటబెట్టుకుని హమ్జా మృతదేహం దగ్గరికి తీసుకెళ్లాడు. దాన్ని చూడగానే ఆమె కోపోద్రేకాలతో ఊగిపోయింది. కత్తితో హమ్జా పొట్ట చీల్చి కాలేయాన్ని బయటికి లాగింది. దాన్ని నిర్దయంగా కసకస నమిలింది. అయితే ఆ పచ్చికాలేయాన్ని నమిలి మింగలేక బయటికి కక్కేసింది. హమ్జాను చంపిన వ్యక్తికి కంఠహారం ఇచ్చేసింది.
అక్కడితో ఆగకుండా అక్కడున్న మృతదేహాల చెవుల్ని కోసి.. వాటిని మెడలో హారంగా వేసుకుంది. హిందా చంపించిన హమ్జా మరెవరో కాదు ముహమ్మద్ ప్రవక్తను కంటికి రెప్పలా కాపాడుకున్న, ప్రవక్త స్వయంగానూ ఎంతగానో ప్రేమించిన సొంత బాబాయి. తన బాబాయి మృతదేహం ముక్కలుగా కడు దయనీయంగా పడి ఉండటాన్ని చూసి దైవప్రవక్త (స) కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. ‘ఒకవేళ మీరు ప్రతీకారం చేస్తే కేవలం మీపై దౌర్జన్యం జరిగిన మేరకే ప్రతీకారం చెయ్యండి. కానీ, మీరు సహనం చూపితే, అది నిశ్చయంగా సహనం చూపేవారికే మంచిది. ప్రవక్తా! సహనంతో పనిచేస్తూ వెళ్లు.. నీకు ఈ సహన భాగ్యం అల్లాహ్ అనుగ్రహం వల్లే కలిగింది. వారి చేష్టలకు వగచకు. వారి పన్నాగాలకు మనసులో ఖేదపడకు. భయ భక్తులతో పని చేస్తూ ఉదాత్తవైఖరి కలిగి ఉండే వారితో అల్లాహ్ ఉంటాడు’ (దివ్య ఖురాన్ 16:126-128) అన్న వాక్యం మదిలో మెదిలి శాంతించారు. హిందా పట్ల ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చినప్పుడు ముహమ్మద్ ప్రవక్త (స) ఆమెను క్షమించి వదిలివేశారు. ముహమ్మద్ ప్రవక్త (స) ప్రతీకారం కంటే క్షమాగుణాన్ని అలవర్చుకోవాలని బోధించారు. ప్రతీ ముస్లిం మృదు స్వభావం, సహనశీలత, విశాల హృదయం కలిగి ఉండాలని ఉద్బోధించారు.