శుక మహర్షి రాజర్షి పరీక్షిత్తుతో.. భారతా! పోరుకు సిద్ధమై కదన భూమికి చేరిన యదు (యాదవ) ధీరుని మాధవుని ‘పోరు నీకేల? గోపాల! పొమ్ము పొమ్ము’ మరలి పొమ్ము అంటూ కారుకూతలు కూస్తూ బీరాలు గొప్పలు పలుకుతున్న మగధ వీరుని జరాసంధుని ప్రగల్భాల బలుపుమాటల తీరును ఎండగడుతూ గండరగండడు, అఖండపరశు (పరశురాముడు)వైన పుండరీకాక్షుడు కృష్ణుడు ఇలా పలికాడు…
మగధ రాజా! బీరాలు పలకడం శూరులకు తగదు. ఎందుకు వదరుతావు? కుదురుగా ఎదురు నిలిచేవారు తప్ప ఈ తాటాకు చప్పుళ్లకు బెదరిపోయే వారెవరూ లేరు. ఇంతటితో అంతమయిందా ఏమి? మునుముందు ఇంకా ఎంతో ఉంది. కల్పాంత ప్రళయ కాల భీకర అగ్నినైనా నేను హరిస్తా! విజయశ్రీని వరిస్తా. ఓ భూపాలకా! నన్ను ‘గోపాలకుడవని, నీవు నా పోలికకు సరిరావని పలికావు. గోపాలక భూపాలకుల తారతమ్యం ఈ సమరంలో ఇప్పుడే నీకు తెలుస్తుంది’ అని సత్యసంధుడు గోవిందుడు నుడువగా, రోష బంధురుడై క్రోధావిష్టుడై జరాసంధుడు ఇలా అన్నాడు.. ‘కృష్ణా! నీవు చిన్నవాడవు. నాతో తలపడడానికి నీ అన్న బలరాముని పంపు. గొల్లపిల్లకాయతో రాజ తల్లజుడు (శ్రేష్ఠుడు) మగధ భూవల్లభుడు భండనం (యుద్ధం) చేశాడని ప్రజలు ఎగ్గు అనాదరపు మాటలు పలుకుతుంటే మేము సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. చాలు, చాలు, బాలకా! తప్పుకో. దివ్య శరములు బాణాలు కల మమ్ము గెలవడం నీ తరము కాదు’. శుకుడు రాజా! పగవాని ఆ తగని మాటలకు నగి (నవ్వి) నగధరుడు హరి తిరిగి ఇలా పలికాడు..
క॥ ‘పొగడు కొనుదురే శూరులు?
మగటిమి జూపుదురు గాక, మాగధ! నీకున్
మగతనము గలిగె నేనిం
దగు మెఱయ వికత్థనములు దగవీ పోరన్’
‘మాగధా! యోధులు పౌరుషం ప్రదర్శిస్తారే కాని, నీ వలె తమను తాము ఊరక ప్రశంసించుకోరు. నీకు మగతనముంటే జగడంలో పగవారి ముందు నీ సెగ ప్రతాపం చూపించు.’ ఇట్లు పలికినందుకు జరాసంధుడు ఆగ్రహంతో పెట్లి బ్రద్దలైపోయాడు. చతురంగ బలాలతో శుభాంగులైన రామకృష్ణులను చుట్టుముట్టాడు.
శుకుడు రాజా! అప్పుడు మాథుర మాగధ సేనలు పరస్పరం మార్కొని ఎదుర్కొని, రౌద్రంతో ప్రళయ కాల పయోధుల సాగరాల భంగి (వలె) నింగిని తాకేటట్లు ఉప్పొంగి పౌరుషంతో పోరాడసాగాయి. భీషణ భండనం జరిగింది. ఈ సందర్భంలో పోతన మహాకవి మూలాన్ని అతిక్రమించి ఆలంకారిక శైలిలో ఆ ఆహవా (సమరా)న్ని హృద్యమైన గద్యలో సహృదయ రసజ్ఞ సంవేద్యంగా అద్భుతంగా వర్ణించాడు.
శుకుడు రాజా!
క॥ ‘భీతంబై హత సుభట
వ్రాతంబై భగ్న తురగ వారణ రథ సం
ఘాతంబై విజయ శ్రీ
వీతంబై యదు బలంబు విరిగె నరేంద్రా!’
యాదవ సైన్యం భయమొంది పారిపోయింది. మేటి వీరులు కాటి పాలయ్యారు. గుర్రాలు, గజాలు, రథాలు భగ్నమయ్యాయి. విజయలక్ష్మిని వరించలేక హరి బలం వెనుకకు మరలింది. రామకృష్ణుల వంటి లోకోత్తర బలసంపన్నులను జరాసంధుడు నిరోధించి వారి సైన్యాలను తరిమికొట్టడం ఎంతో వింతగా ఉన్నదని మేడల మీదికి చేరి కన్న మథురాపుర కాంతలు మిక్కిలి వంత సంతాపం పొందారు. ఇది సిద్ధార్థుని, సిద్ధ సంకల్పుని యుద్ధతంత్రము, నైకమాయుని మహామాయుని మాయా మంత్రము, కాలరూపుని, నీల జీమూత సన్నిభుని లీలా యంత్ర విభూతి కదా! కాదేని, అజితునికి, జయ విజయ రూపునికి అపరాజితునికి పరాజయ మేమిటి?
శుకయోగి పరీక్షిన్మహారాజా! తన బలాలు పరాజయం పాలై పలాయన మంత్రం పఠించడం కని అనిరుద్ధుడు హరి సమర సంరంభంతో అవనీభారం వహించే దిగ్గజ తుండాల వంటి తన భుజ దండాలు సారించి బ్రహ్మాండ భాండం బ్రద్దలయ్యేట్లుగా పాంచజన్యం పూరించాడు. హల (నాగలి) ముసల (రోకలి) ప్రహారా (దెబ్బ)లతో ఆహవ రంగంలో హాహాకారాలు సృష్టిస్తూ ప్రళయకాల ప్రేతపతి (యముని) వలె ప్రకాశిస్తున్న బలభద్రుని అమాత్యుడు ‘లయ విభాతి’ పద్యంలో హొయలు సొగసు మీర వర్ణించిన తీరు కలయ చూడండి..
లయ॥ ‘ప్రళయ సమయాంతకుని చెలువున గటాక్షముల,
నలఘు చటులాగ్ని కణములు సెదర గోలా
హలముగ సువర్ణ మణి వలయ నిచయోజ్జలిత,
హలము వడి జూచి శిరములు నురములున్ని
ర్దళితములుగన్ శకలములుగ నొనరింపగని,
పెలుకురి జరాసుతుని బలము రణవీధిం
జలిత దనుజావళికి బలికి భయభీతి సుర,
ఫలికి త్రిజగచ్ఛలికి హలికి దలడించెన్’
బలరాముడు రక్కసి మూకలను ఉక్కడగించిన మహా బలశాలి. మూడు లోకాలనూ గడగడలాడించి హడలెత్తించినవాడు. శ్రీహరికి అనల్ప తల్పమైనవాడు, ఆర్తులైన ఆశ్రితుల పాలిటి కల్పవృక్షము. ఆ హలాయుధుడు ప్రళయకాల యముని వలె కటాక్షముల కడగంటి చూపుల నుంచి తీక్ష్ణమైన నిప్పురవ్వల తూపులు (బాణాలు) రువ్వుచూ, రత్నాలు పొదిగిన బంగారు కడియాలతో రంగారు రంజిల్లు తన హలాన్ని చేబూని వేగంగా విసురుతూ కోలాహలంగా విరోధుల తలలు, రొమ్ములు చీల్చి శకలమ్ములు ముక్కలు చేశాడు. అది చూచి జరాసుతుని సైన్యం వెరపు భయంతో విలవిల్లాడుతూ, వెలవెలబోతూ తమలమున యుద్ధంలో తలవంచింది.
క॥ ‘హరి తిగ్మ గోశతంబుల
హరిదంతర మెల్ల గప్పు నాకృతి గడిమిన్
హరి తిగ్మ గోశతంబుల
హరి దంతరమెల్ల గప్పె నతి భీకరుడై’..
(హరి సూర్యుడు, శ్రీకృష్ణుడు, గో కిరణము, బాణము; తిగ్మ వాడియైన; హరిత్ దిక్కు) ‘సూర్యుడు వందల కొలదీ కిరణాలచే దిగంతాలను ఆవరించునట్లు, శ్రీకృష్ణుడు అరి భయంకరుడై పరాక్రమించి తన ఖర వాడియైన, గో బాణాలచే నానా దిక్కులను కప్పివేశాడు.’ శబ్దాలంకార బంధుర ఒప్పిదమైన బహు సుందర కందం.
శుకుడు రాజా! కనీవినీ ఎరుగని ఆ అని యుద్ధం గురించి ఏమని చెప్పేది? ప్రళయ కాల సాగరంలా భీతావహంగా చుట్టుముట్టిన ఆ జరాసంధుని సైన్యాన్ని హరిబలులు అవక్రవిక్రమంతో పరిమార్చారు. ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయాలను అవలీలగా చేయగల శ్రీహరికి అరి సంక్షయం శత్రునాశనం ఒక్క లెక్కలోనిది కాదు. అయినా, ఆయన మానవుడై అవతరించిన వాడు కాన, ఎన్నో కావ్యాలలో అలా సంభావ్యుడు ప్రస్తుతింపబడిన వాడయ్యాడు. రాజా! బలరాముడు ఒక్కపెట్టున ముందుకురికి మదాంధుడైన జరాసంధుని పట్టుకొన్నాడు. ఆ జగజెట్టి కొట్టిన లోక భీకరాలైన ముష్టి ఘాతాలకు మగధ రాజు ప్రాణాలు కంఠగతాలయ్యాయి ఠావులు తప్పాయి. ఇలా (భూ) భారాన్ని తొలగించడానికి కుతూహల పడుతున్న కాలరూపుడైన చక్రి, భావి కార్యం (జరాసంధ వధ వృకోదరుని వంతు కదా!) తలపోసి జరాసుతుని వధ నివారించి అతనితో ‘జరాసంధా! ఈ పరాభవానికి నీవు చింతించవద్దు. పో! నీ మనోవ్యధ తీరిన పిమ్మట మరోమారు రా. కండ బలమున్నదా, శత్రువులను దండించు. లేనిచో లోకులు మెచ్చునట్లు నీ శక్తి మేరకు పరాక్రమం చాటి నీ మెదడు, మాంసపు ముక్కలను నక్కలు, రాబందులు తినునట్లుగ తనువును త్యజించడం ఎంతో మేలు’ అని పలికి నవ్వుతూ వానిని విడిచిపుచ్చాడు. వాడేమో సిగ్గుతో కుమిలిపోతూ, ముఖం చూపలేక ‘తల్లక్రిందుల తపస్సు చేసైనా సరే, ఈ బల్లిదులను (బలశాలురను) హరిరాములను జయించాలి’ అని మనసులో భావిస్తూ రాజధాని గిరివ్రజానికి మరలిపోయాడు. మథురా నగర వాసులు బాజ భజంత్రీలతో స్వాగతం పలుకగా రామకృష్ణులు నగర ప్రవేశం చేశారు. అనంతరం మాగధుడు అంతులేని అసూయా ద్వేషాలతో అవనీ (భూ) మండలంలోని దుష్ట రాజులందరినీ సమకూర్చుకొని, పదిహేడు అక్షౌహిణీ సైన్యంతో పదిహేడు పర్యాయాలు మథురపై దండెత్తాడు. తడవ తడవకు తెచ్చిన సేనలను కడతేర్చుతూ (చంపుతూ) పుడమి భారాన్ని వెడలిం (తొలగిం)చాడు పాలకడలి శయనుడు. కడకు పదునెనిమిదవ సారి కదనానికి కాలు దువ్వుతూ కదలి వస్తూండగా, కలహ విద్యా విశారదుడైన నారదుడు కాలయవనుని (మ్లేచ్ఛవీరుడు) వద్దకు వచ్చి ఇలా అన్నాడు.. యవనా! నీవు ఈ భువనంలోని అవనీశ్వరు (రాజు) లందరినీ జయించిన విక్రమశాలివి. యాదవులను మరచావా? లేక వారి అప్రతిమ పౌరుష ప్రతాపాలకు వెరచావా?
క॥ ‘యాదవుల లోన నొక్కడు
మేదినిపై సత్తరేఖ మెరసి జరాసం
ధాదుల దూలన్ దోలెన్
దాదృశుడిల లేడు వినవె తత్కర్మంబుల్?’
– యాదవులలో ఒక యోధుడు- బలాఢ్యుడు మేదిని (భూమి)పై వెలసి ఓజ (కాంతి)తో తేజరిల్లుతున్నాడు. అతడు జరాసంధాదులను ఆజి (యుద్ధం)లో తొలగగొట్టాడు. అట్టివాడు ఈ ఇల (భూమి)లో మరొకడు లేడు. అతని ఘనకార్యాలను- లీలా విభూతులను యవనా నీవు వినలేదా? శుకుడు- రాజా! ఆ మాటలు విన్న కాలయవనుడు.. నారదా! నీవు తెలిపిన నరుడు ఎంతటివాడు? ఏ తీరువాడు? రూపురేఖలు ఎట్టివి? ఎక్కడుంటాడు? వాని భుజబలం ఏపాటిది? పోరులో నాకు ఎదురొడ్డి నిలవగలడా?’ అని అడుగగా దేవర్షి ఇట్లన్నాడు..