శుక ఉవాచ- పరీక్షిన్మహారాజా! ఒకనాడు అరిష్టుడు (మూర్తీభవించిన అశుభం, ఉపద్రవం) అనే అసురుడు అచ్యుతు-కృష్ణునికి అరిష్టం కలిగించాలని వృషభ రూపం ధరించి, అహంకారంతో మహావేగంగా నందవ్రజం- మందపై అమాంతంగా విరుచుకుపడ్డాడు.గొల్లలూ, ఎద్దులూ, ఆవులూ, దూడలూ సర్వం చెల్లాచెదరు కావడం వల్లవ వీరుడు హరి పరికించాడు. తల్లడ పడి గొల్లలందరూ శౌరిని శరణు వేడారు. నందుపట్టి దానవుని కొమ్ములు పట్టి వానిని మట్టి కరిపించి, వాని కొమ్ము పీకి దానితోనే వాణ్ని చితకకొట్టాడు. అసురుడు పస చెడి ఉసురులు- ప్రాణాలు విడిచాడు. విబుధులు- వేల్పులు హరిపైవిరివిగా విరుల వానలు కురిపించారు.
‘వృషః, వృషభః’ అనగా ఇహ- పర సర్వసుఖ ఫలాలను వర్షించే ‘ధర్మం’. ఇక్కడ ధర్మంగా చలామణి అయ్యే అధర్మమే వృషభాసురుడు. ధర్మ ఆభాస, ధర్మంగా తోచే అధర్మం- మేక వన్నె పులి, పయోముఖ విషకుంభం! భగవద్, భక్తి విరుద్ధ ధర్మంలో అసురత్వం నివాసముంటుంది. బలరామకృష్ణులు నందగోకులం- బృందావనంలో భద్రంగా ఉన్నారని నారద మునీంద్రుని వలన విన్న, హింసకు మారుపేరైన కంసుడు దేవకీ వసుదేవులను ఇనుప సంకెళ్లతో బంధించాడు. రామకేశవులను హత మార్చడానికి కేశి అనే రేగాము- రాక్షసుని గోకులానికి పంపాడు. అనంతరం మంత్రులను, మావటివాండ్రను, చాణూర ముష్టికులనే దుష్టులైన మల్లయోధులను పిలిపించి వారితో ఇలా పలికాడు…
క॥ ‘పట్టణ జనములు సూతురు
దట్టంబుగ మల్లరంగ తల పార్శములం
బెట్టింపుడు తమగంబులు
పుట్టింపుడు వీట మల్లు పోరను మాటన్’
‘ఇష్ట సఖులారా! జెట్టిపోరు (మల్లయుద్ధం) ఏర్పాటు చేయండి. మల్లరంగానికి నాలుగు దిక్కులా గట్టి మంచెలు కట్టించండి. పట్టణ ప్రజలు వచ్చి తిలకిస్తారు. నగరం నాలుగు మూలలా ఈ మాటను చాటండి. దిట్టలైన చాణూర ముష్టికులారా! మీరు జెట్టిపోరులో జగజెట్టులన్న పేరు గన్నవారు. అన్నలూ! మల్లయుద్ధంలో గొల్ల సోదరులను- రామకృష్ణులను మట్టుబెట్టి నాకు గట్టిగా ప్రీతిపాత్రులు కండి. ఓ మావటీ! మల్లరంగ ప్రవేశ ద్వారం వద్దనే కువలయాపీడ మదగజాన్ని అదలించి- ఉసిగొలిపి పసివారి మీదకు వదలిపెట్టు. చతుర్దశి నాడు విజయం కొరకు వైభవోపేతంగా ధనుర్యాగం చెయ్యాలి. పశుపతి- రుద్రునికి ప్రీతిగా పశు విశసనాలు- జంతుబలులు గావించండి.’ రాజా! ఇలా తన వారినందరినీ ఆయా పనులకు పురికొల్పి కంసుడు, యాదవులలో ఉత్తముడైన అక్రూరుని రప్పించి, చేయి పట్టుకొని ఇలా అర్థించాడు.
శా॥ ‘అక్రూరత్వము తోడ నీవు మనగా నక్రూర నామంబు ని
ర్వక్రత్వంబున జెల్లె మైత్రి సలుపన్ వచ్చున్ నినుం జేరి నీ
వక్రోధుండవు మందలోన బలకృష్ణాభీరు లస్మద్వినా
శ క్రీడారతులై చరింతురట యోజం దెచ్చి యొప్పింపవే!’
‘మహాత్మా! క్రూరకృత్యాలకు పాలుపడకుండా మనుగడ సాగించడం వలన ‘అక్రూరుడు’ అనే అన్వర్థ- సార్థక నామం నీకు చక్కగా అమరింది. నీవు మిక్కిలి స్నేహా- నెయ్యానికి పాత్రుడవు. కినుక- కోపం లేనివాడవు. నందగోకులంలో రామకృష్ణులు నాతో కయ్యానికి కాలు దువ్వడానికి ఓ అయ్యా! సిద్ధమవుతున్నారట. ధనుర్యాగమనే నెపంతో నందాదులైన పెద్దలకు చెప్పి ఒప్పించి, వారిని తెచ్చి అప్పగించి నాకు ప్రాణాపాయం తప్పించు. అక్రూరా! పగవారి గుట్టు రట్టు చేయాలి. విరోధులను వృద్ధి కానీయ తగదు!’ నృశంసు- క్రూరుడైన కంసుని పలుకులు విని అక్రూరుడు ఉక్రోష పడక- రోషం పొందక, నిర్వక్రంగా- వక్రత లేక సరళంగా ఇలా వక్కాణించాడు…
ఉ॥ ‘పంపిన బోనివాడనె నృపాలక! మానవు లెన్న దమ్మునూ
హింపరు దైవ యోగముల నించుక గానరు తోచినట్లు ని
ష్కంపగతిం జరింతురది గాదన వచ్చునె? యీశ్వరేచ్ఛ ద
ప్పింపగ రాదు నీ పగతు బిడ్డల దెచ్చెద బోయి వచ్చెదన్’
మహారాజా! నీవు ఆదేశిస్తే నేను వెళ్లకుండా ఉండగలనా? వాస్తవంగా ఆలోచిస్తే… మానవులు తమ శక్తి ఎట్టిదో, దైవశక్తి ఎలాంటిదో ఇంచుక కూడా గ్రహించలేరు. తమ బుద్ధికి తోచినట్లుగా పట్టుదలతో ప్రవర్తిస్తుంటారు. కాదనడానికి వలను కాదు. విధి వ్రాత తప్పించడం ఎవరి తరమూ కాదు. నేను వెళ్లి నీ విరోధి పుత్రులను ఇక్కడికి తెప్పిస్తాను.’
‘తన చావును తొలగించుకోడానికి కంసుడు ఇలా తలచడం సబబే. మానవుడు సిద్ధి, అసిద్ధులను, జయాపజయాలను సమంగా భావిస్తూ కర్తవ్యం నిర్వర్తించుకుంటూ పోవాలి. ఫలమిచ్చేది మన ప్రయత్నం కాదు, దైవం మాత్రమే. మనిషి కోరికల గాలిమేడలు కట్టుకుంటూ ఉంటాడు. ప్రారబ్ధం అనుకూలమై అభిలాష ఫలిస్తే ఆనందిస్తాడు. విఫలమైతే విషాదంలో మునిగిపోతాడు. అయినా నేను నీ ఆజ్ఞను శిరసావహిస్తా!’ ఇదీ అక్రూరుని అంతరంగంలోని అంతర్మథనం! శుకుడు… రాజా! ఇదిలా ఉండగా కంసుని పంపున ‘కేశి’ అను రక్కసుడు నందుని మందలో ప్రవేశించి అమంద- మిక్కిలి సంకటం కలిగించాడు.
క॥ ‘భీషణ ఘోటక దానవ
హేషా నిర్ఘోష భిన్న హృదయ నిఖిల గో
యోషా పురుషార్భకమై
ఘోషము హరి సూడ దైన్య ఘోషం బయ్యెన్’
దారుణమైన అశ్వ- గుర్రపు ఆకారంలో ఉన్న ఆ అసురుని సకిలింత వినేసరికి మందలోని ఆవులు, దూడలు, ఆడ, మగ, బిడ్డలూ- అందరి హృదయాలూ కొందల- క్షోభ పడ్డాయి. గోవిందుడు చూస్తూండగానే ఆ ఘోష గోకులమంతా దీనంగా ఘోషించింది. అశ్వరూపంలో ఉన్న ఆ రక్కసుడు కర్కశంగా సకిలిస్తూ నింగినే మింగబోయే భంగి- విధంగా, నోరు పెద్దగా తెరచి పంకజాక్షుని కరవడానికి పొంకం- పొగరుగా ఉంకించాడు- పూనుకొన్నాడు. అండజవాహనుడు కృష్ణుడు దిగ్గజ తుండము వంటి తన చండ ప్రచండ బాహుదండాన్ని ఘోట నిశాటుని- గుర్రపు రాక్షసుని నోటిలోనికి చొనిపాడు- పొడిచాడు. గండైన- బలిష్ఠమగు వాని దేహం కర్కటికా ఫలం- దోసపండు లాగా రెండుగా చీలిపోయింది. ఇలా, జలజాతాక్షుడు బలరామానుజుడు కేశవుడు కేశిని అలవోకగా విలయం- అంతం గావించాడు.
కేశిని సంహరించి రమేశుడు కేశవుడుగా వాసికెక్కాడు. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు- త్రిమూర్తులు ఎవనికి వశపడి ఉంటారో, వాడు కేశవుడని కూడా విశదమైన అర్థం. కేశి, హయగ్రీవ అసురుని అపర రూపం. వీడు వేద తస్కరుడు. ‘నిగమ (వేద) తాత్పర్యం లోకానికి సుగమంగా తెలియనీయక మభ్యపెట్టి అగమ్య గోచరంగా- దాచి ఉంచేవాడు. వేదానికి పరమ తాత్పర్యం భగవంతుడు మరియు భక్తి! వ్రజం- గోకులం- ఇంద్రియ సమూహంలో వేదం పేరిట భక్తి విరుద్ధమైన ఖేద మూలక ఆసుర భావాన్ని విస్తరింప జేసే దాంభికుడే కేశి!’ అని వ్యాఖ్యానం.
శుకుడు- భూకాంతా! అంతలో నారాయణ భక్తి పరాయణుడైన నారద మహర్షి నందనందనుని సందర్శించి ఏకాంతంలో ఇలా విన్నవించాడు.. దేవా! రాజుల ఆకారాలు ధరించి ఉన్న రాక్షసులను ఖండించి ఈ భూమండలాన్ని రక్షించడానికి నీవు అవతరించావు. ఓ ప్రభూ! ఇకముందు చాణూర, ముష్టిక, కంస, శంఖచూడ, కాలయవన, నరక, ముర, పౌండ్రక, శిశుపాల, దంతవక్త్ర, సాల్వాదులు నీ చేతిలో సద్గతి చెందుతారు. దేవలోకం నుంచి, ఓ భక్త కల్పవృక్షమా! పారిజాత పాదపాన్ని పెకలించి తెస్తావు. నీవల్ల నృగునికి శాప విముక్తి ఒనగూరుతుంది. శమంతక మణిని స్వీకరిస్తావు. మృతులైన బ్రాహ్మణ పుత్రులను సజీవంగా తెచ్చి ఇవ్వగలవు. భారత సంగ్రామంలో అర్జునునికి సారథ్యం వహించి పెక్కు అక్షౌహిణుల సైన్యాన్ని ఉక్కడగించి- నశింపజేసి, ఎంచక్కా భూభారాన్ని తొలగిస్తావు.
శా॥ ‘కృష్ణా! నీవొనరించు కార్యములు లెక్కింపన్ సమర్థుండె? వ
ర్ధిష్ణుండైన విధాత మూడు గుణముల్ దీపించు లోపించు రో
చిష్ణుత్వంబున నుండు నీ వలన; నిస్సీమంబు నీ రూపునిన్
విష్ణుం జిష్ణు సహిష్ణు నీశు నమితున్ విశ్వేశ్వరున్ మ్రొక్కెదన్’
‘ఓ కృష్ణా! వర్ధిష్ణుడు- వర్ధన శీలుడైన విధాత- బ్రహ్మదేవుడు కూడా నీవు సాధించిన ఘన కార్యాలను లెక్కించడానికి ఒక్కింత కూడా సమర్థుడు కాడు. వల్లవ వీరా! నీ వల్లనే ఎల్లెడల సత్త రజ స్తమో గుణాలు పుట్టి, పెరిగి, గిట్టి పోతాయి. నీ రూపం అపురూపం, అపారం. నీవు విష్ణువవు- సర్వవ్యాపివి, జిష్ణవవు- సర్వత్ర, సర్వదా జయశీలివి, సహిష్ణువవు- సహనశీలివి, పరమేశ్వరుడవు, అమితుడవు- మితి (పరిమితి) లేనివాడవు. ప్రమాణ రహితుడవు కూడా! విశ్వేశ్వరుడవు- ప్రపంచ నియామకుడవు. శాసించువాడవు. ఓ నందపట్టీ! జగజెట్టివైన ఇట్టి నీకు వందనాలు!’ ఇలా దేవదేవుని- మురహరుని పరిపరి విధాల కొనియాడి నారద ముని సెలవు గైకొని దేవలోకానికి మరలిపోయాడు.
శుకుడు- రాజా! మరొక రోజున గోపబాలురు రామకృష్ణులతో కూడి వనంలో పశువులను మేపుతూ ఒక పర్వతం చెంత నిశ్చింతగా ‘నిలాయన క్రీడ’- గంతలాట (దాగుడు మూతలు) ఆరంభించారు. అంతలో మయుడనే దానవుని జ్యేష్ఠ పుత్రుడు వ్యోమాసురుడు మాయ పూని గోపాలకుని రూపం ధరించి దొంగతనంగా ఆ దండులో జొరబడ్డాడు. ‘చతుః పంచావశిష్టంగా’- నలుగురైదుగురిని తప్ప తక్కిన వారందరినీ ఒక్కొక్కరిగా ఆ కొండగుహలో చేర్చి ఒక పెద్ద బండతో ద్వారం మూసి అమాయకుని లాగా ఆ గండడు ఆటలో వచ్చి చేరాడు. అఖిల వేది- సర్వజ్ఞుడు, అసురభేది- దానవ మర్దనుడు, ఆది నారాయణుడు మాధవుడు నవ్వుతూ వ్యోమాసురునికి సమాధి కట్టాడు. భక్తికి విరుద్ధంగా, భగవద్ విశ్వాసాన్ని సడలిస్తూ జడలు విప్పి నాస్తికతకు ఊతమిచ్చే యోగ ‘ఆభాస’- యోగం ముసుగులో భోగమే వ్యోమాసురుడు! వాసుదేవుని భాసురమైన కృప కలగనిదే ఈ ఆభాస- భ్రాంతి తొలగదు.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006