తిరుపతి : పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిసాయి . ఈనెల 16 నుంచి ఏడు రోజుల పాటు తిరుపతి, తాళ్లపాకలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించింది.ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం ఘనంగా జరిగింది.
ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ కోదండరామస్వామివారి ఆలయం నుంచి అన్నమాచార్య కళామందిరానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తనా గోష్టిగానం నిర్వహించారు. అనంతరం తిరిగి స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ కోదండరామాలయానికి తీసుకెళ్లారు. తిరుపతికి చెందిన జయంతి సావిత్రి బృందం హరికథ పారాయణం చేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో దుర్గ రాజు, సూపరింటెండెంట్ రమేశ్, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ లత, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.