అక్షయ తృతీయ పర్వదినం సింహాచల క్షేత్రంలో ప్రత్యేకంగా జరుగుతుంది. ఏడాదంతా మణుగుల కొద్దీ చందనాన్ని అలదుకున్న అప్పన్న అక్షయ తృతీయ సందర్భంగా నిజరూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడేందుకు శ్రీహరి.. నరకేసరిగా ఈ సింహాచలంపై అవతరించాడు. ప్రహ్లాదునితో హరినామ స్మరణ మాన్పించడానికి హిరణ్యకశిపుడు నానా విధాలుగా పసిబాలకుణ్ని ఇక్కట్లకు గురిచేశాడు. ప్రహ్లాదుడిని సముద్రంలో పడవేయించాడు.
ఆ పసిబాలుణ్ని శ్రీహరి కాపాడాడు. కొండపై నుంచి పడదోశాడు. మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై.. మళ్లీ రక్షించాడు. తనను ఆదుకున్న నారాయణుడిని ప్రహ్లాదుడు స్తుతించగా.. ఆ బాల భక్తుడికి వరాహ నరసింహ రూపాన్ని అనుగ్రహించాడు విష్ణుమూర్తి. తన భక్తుడి కోరిక మీద ఆ కొండపైనే, అదే రూపంలో స్థిరంగా ఉండిపోయాడు. హిరణ్యకశిపుడి సంహారం తర్వాత ప్రహ్లాదుడు వరాహ నృసింహస్వామికి దేవాలయాన్ని కట్టించాడని స్థలపురాణం చెబుతున్నది.
ఇక్కడ కొలువుదీరిన స్వామికి చందనం ప్రీతి. స్వామి ఉగ్రరూపాన్ని ఉపశమింపజేయడానికి నిత్యం మణుగుల కొద్దీ చందనాన్ని మూలమూర్తికి అలదుతుంటారు అర్చకులు. పొరలు పొరలుగా చందనం అలదడంతో స్వామి విగ్రహం లింగాకారంగా దర్శనమిస్తుంది. ఏటా వైశాఖ శుక్ల తదియ (అక్షయ తృతీయ) నాడు సశాస్త్రీయంగా, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ చందనాన్ని మొత్తంగా తొలగిస్తారు. ఆనాడు లభించే నిజరూప దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. స్వామి నుంచి వెలికి తీసిన చందనాన్ని ప్రసాదంగా భక్తులు తీసుకుంటారు. దీనిని ధరించడం ద్వారా, ప్రసాదంగా తీసుకోవడం ద్వారా సకల అభీష్టాలు నెరవేరుతాయనీ, ఆరోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మిక.
కాలక్రమంలో ఈ ఆలయం శిథిలం కాగా, పురూరవ చక్రవర్తికి వరాహ లక్ష్మీనరసింహ స్వామి దర్శనమైందట. ఆయనే సింహాద్రి ఆలయాన్ని పునురుద్ధరించాడట. ఆ సమయంలో పురూరవుడు స్వామి పాదాలను దర్శించలేకపోయాడట. కలత చెందిన పురూరవుడితో అశరీరవాణి ‘మహారాజా! ఈ స్వామి పాదాలను నీవు దర్శించలేవు, కానీ స్వామి వారిని శాస్ర్తోక్తంగా అర్చించి, ఆ దివ్య మంగళ విగ్రహం నిండా చందనం అలంకరించు. భక్తులెవ్వరూ మిగిలిన రోజులలో స్వామి నిజరూపాన్ని దర్శించలేరు, అక్షయ తదియ రోజు మాత్రమే చందనం పూర్తిగా తొలగించిన తరువాత నిజరూప దర్శనం చేసుకోగలరు’ అని పలికిందట. పురూరవుడు అలాగే చందనం అలది స్వామిని పూజించాడట. అప్పటినుంచి ఇక్కడ నిత్య చందనోత్సవం సంప్రదాయంగా వస్తున్నది.
– డా॥ కండ్లకుంట నరసింహమూర్తి 94401 60035