ఒక ఊర్లో ఓ విద్యావంతుడు ఉండేవాడు. అతను ఖాళీ సమయాల్లో పక్కనున్న పల్లెలకు వెళ్లి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అలా వెళ్లేటప్పుడు ఆ విద్యావంతుడు యువకుడైన ఓ శిష్యుణ్ని వెంటపెట్టుకునేవాడు. ఒక పౌర్ణమి రోజున ఆ విద్యావంతుడు శిష్యుడితోపాటు గ్రామాలకు వెళ్లి ఉపన్యాసం ఇచ్చి తిరుగు ప్రయాణం అయ్యాడు. అప్పుడు శిష్యుడు చిన్నగా ‘గురూజీ, నాదో చిన్న ఆలోచన. మీరు ఉపన్యాసాలకు వెళ్లేటప్పుడు అందంగా తయారవ్వండి. ఆకర్షణీయమైన దుస్తులు ధరించండి. జుట్టుకు నల్లరంగు వేయండి. భుజానికి ఖరీదైన సంచి తగిలించండి. కళ్లకు అందమైన కళ్లజోడు పెట్టండి. అప్పుడు జనం మిమ్మల్ని మరింత గొప్పగా ఆదరిస్తారు’ అని చెప్పాడు. ‘అలాగా’ అని ఊరుకున్నాడు విద్యావంతుడు.
ఇద్దరూ కొద్దిదూరం నడిచారు. దారిలో వారికి ఒక పూల అంగడి కనిపించింది. విద్యావంతుడు, ‘శిష్యుడితో కొన్ని గులాబీలు తీసుకో! మన ఇంటి ద్వారానికి అలంకరిద్దాం!’ అన్నాడు. గబగబా వెళ్లి పూలు తీసుకువచ్చాడు శిష్యుడు. వెంటనే విద్యావంతుడు ‘అలాగే, పక్కనే ఉన్న అంగడికి వెళ్లి సెంటు సీసా ఒకటి కొనుక్కుని రా!’ అన్నాడు. ‘సెంటు సీసా ఎందుకు గురూజీ?’ అని ఆశ్చర్యంగా అడిగాడు శిష్యుడు. ‘ఈ గులాబీలకు సెంటు కొడితే మరింతగా గుబాళిస్తాయి కదా’ అన్నాడు విద్యావంతుడు. ‘సహజమైన గులాబీలకు సెంటు కొట్టడం ఎందుకు గురువు గారు? వాటి సహజమైన పరిమళం వాటికి ఉంది కదా!’ అన్నాడు.
చిన్నగా నవ్విన విద్యావంతుడు ‘నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు నలుగురికి చెబుతున్నాను. నాకు సోకులు ఎందుకు శిష్యా. పైపై మెరుగులు, ఆడంబరాలు చూసి జనం ఒకరోజు మోసపోతారు, నెల రోజులు మోసపోతారు. అంతేకానీ ఎక్కువ కాలం మోసపోరు. మనలో సత్తా లేకుండా రకరకాల వ్యవహారాలు చేసి ఎదుటివారిని ఎల్లకాలం మోసం చేయలేం. అద్దిన అందం, దిద్దిన బుద్ధి ఎక్కువకాలం నిలబడవు’ అని సమాధానమిచ్చాడు. ‘సహజత్వం శాశ్వతం.. కృత్రిమత్వం కొన్నాళ్లే’ అని తెలుసుకున్న శిష్యుడు, గులాబీలతో విద్యావంతుడిని అనుసరించాడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు,93936 62821