ఇస్లాం ప్రకారం అల్లాహ్ను స్మరిస్తూ భోజనం తినడం శుభాన్ని కలిగించే పుణ్య కార్యం. భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, పద్ధతులను ఇస్లాం వివరంగా ఖురాన్లో, వివిధ హదీసుల్లో పేర్కొంది. ‘భోజనం చేసే ముందు దైవ నామాన్ని పఠించు. కుడి చేత్తో తిను. నీకు దగ్గరలో ఉన్నవాటిని తీసుకొని తిను’ అని దైవ ప్రవక్త (సల్లం) ఉపదేశించారు. ‘శుభాలు అన్నం మధ్యలో అవతరిస్తాయి. కనుక మీరు దాన్ని రెండు పక్కల్లోనూ మధ్య భాగం నుంచి తినండి. మధ్యలో నుంచి తినకండి’ అని ఆయన సూచించారు. ఆయన తన దగ్గరున్న గర్రా అనే పళ్లెం చుట్టూ ప్రజలను కూర్చోబెట్టుకొని భోజనం చేసేవారు. ఇతరులతో కలిసి భోజనం చేయడం, మోకాళ్ల ఆధారంగా కూర్చొని తినడం పుణ్యప్రదమని ఆయన బోధనలు ఉపదేశిస్తాయి. కాళ్లు మోకాళ్ల వరకు మడచి అరికాళ్ల మీద కూర్చొని భోజనం చేయడం అభిలషణీయమైన పద్ధతి.
కుడి కాలు ఎత్తి ఎడమ కాలి ఆధారంగా కూర్చోవాలి (ఫత్హుల్ బారీ). అన్నాన్ని వృథా చేయకుండా తినాలి. తిన్న తర్వాత చేతిని శుభ్రంగా నాకి ఆ తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అలాగే నీళ్లు కూర్చొని తాగాలి. కుడి చేతితో నీటి పాత్రను పట్టుకోవాలి. కొద్ది కొద్దిగా కనీసం మూడు గుక్కల్లో నీళ్లు తాగాలి. నీళ్లు తాగే ముందు ‘బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్’ అని పఠించాలి. తాగిన తర్వాత ’అల్హమ్దులిల్లాహ్’ అని పలకాలి. నీళ్ల పాత్రలో శ్వాస విడవకూడదు, ఊదకూడదు. దైవప్రవక్త(స) ఆరోగ్యానికి మేలు చేసే, రోగాల్ని తగ్గించే అనేక ఆహార పదార్థాల గురించి తెలియజేశారు. ఆవు పాలను, నెయ్యిని తప్పనిసరిగా తీసుకోవాలని, వాటిలో ఔషధ గుణాలున్నాయని చెప్పారు. దాహం, వేడి, మంట, రక్తపోటును దోసకాయ దూరం చేస్తుందని తెలిపారు. పైత్యానికి, సెగ రోగానికి, కామెర్లకు తర్బూజా హితకారిగా పని చేస్తుందని పేర్కొన్నారు.