ఆ మాటలు ఆలోచనామృతాలు. చింతిత హృదయసీమలో చింతనా సరస్సులు. ఆకలైన వానికి పట్టెడన్నం పెట్టిన తల్లిలా ఆ వాణి అందరికీ వినిపించింది. అది విని విశ్వం తుళ్లిపడి మేల్కొంది. అదే క్రీస్తు వాణి. సాదాసీదా జనం ఆ స్వరానికి అతుక్కుపోయి ఆలకిస్తూ ఉన్నారు. ఎవరూ ఊరకే దుఃఖించవద్దనీ, గొప్ప ఓదార్పు లభిస్తుందనీ స్పష్టం చేసింది క్రీస్తువాణి. అంతేకాదు ‘నీతి కోసం ఆకలి మంటలు భరించండి. మీకు అనంతమైన తృప్తి లభిస్తుంద’న్న హామీ ఇవ్వడంతో అసంతృప్తి జ్వాలల్లో మగ్గిపోయే వారికి చల్లని సాంత్వన లభించినట్లయింది.
‘దేవుడు కనిపించలేదని వెర్రిగా వెతకొద్దు, మీ హృదయాలు శుద్ధి చేసుకోండి, మీకు దైవ దర్శనం తప్పక జరుగుతుంద’న్న క్రీస్తువాణి మనుషులు స్వచ్ఛంగా ఉండాలని ఉద్బోధిస్తుంది. ‘కూరను రుచిగా మారుస్తూ ఉప్పు ఎలాగైతే విలువను సంతరించుకుంటుందో.. ఈ లోకంలో మీ పాత్ర కూడా అంతే గొప్పది. కాబట్టి ఉప్పులా బతకండి’ అని మార్గనిర్దేశనం చేసింది క్రీస్తువాణి. అంతేకాదు, స్తంభంపై పెట్టిన దీపంలా పక్కవారికి వెలుగు చూపాలని హితవు పలికింది. కుంచం కింద దివ్వెలా సంకుచితంగా ఉండొద్దని హెచ్చరించింది. అలా క్రీస్తువాణి విశ్వవాణి అయి లోకమంతా వినిపించింది. ఆ వాణిని అనుసరించడానికి లోకమంతా ఉద్యమించింది. (మత్తయి 5:3-15 )
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024