ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Devotional - Aug 03, 2020 , 23:47:41

ఆచార్య దేవోభవ!

ఆచార్య దేవోభవ!

తల్లి, తండ్రి, గురువు పూజనీయులు. దైవ స్వరూపులు. ఈ మువ్వురు త్రిమూర్తుల్లాంటి వారు. త్రేతాగ్నుల్లాంటి వారు. త్రిలోకాల్లాంటి వారు. వేదత్రయం లాంటివారు. వారిని సేవిస్తూ, వారు చెప్పిన దాన్ని పాటించడం మన ధర్మం. జన్మనిచ్చే వారు తల్లిదండ్రులైతే, జ్ఞానప్రదాత ఆచార్యుడు. ఆచార్యుడన్నా, గురువన్నా ఒకటే. ఆచార్యుడైన వాడు మితభాషి. హితభాషి కూడా. ఆచార్యుడన్నవాడు సంప్రదాయవాది. సదాచార సంపన్నుడు. సహనశీలి. ఆధ్యాత్మిక వేత్త. ఆశ్రయింపదగిన వాడు.

తోడు పెట్టకుండా పాలు పెరుగు కానట్లే, ఆచార్య బోధ లేకుండా శిష్యుడు జీవితంలోని విలువల్ని, మెళకువల్ని గ్రహించలేడు. తెలంగాణ ప్రాంతంలో బాగా ప్రచారంలో వున్న ‘తిరునామా’ల్లో పేర్కొన్నట్లు ‘వెలుగు లేని తోవ ఏలా? మరుగు లేని ఇల్లు ఏలా? గురువు లేని జన్మమేలా?’ అని పలకడం సార్థకమే. ఆచార్యుడొక బ్రహ్మ. బ్రహ్మగా శిష్యుల భవిష్యత్తు రాస్తాడు. ఆచార్యుడొక విష్ణువు. విష్ణువులాగా వారి బాగోగులు పట్టించుకుంటాడు. ఆచార్యుడొక శివుడు. ఈశ్వరుడిలా వారిలోని దౌర్బల్యాలను హరించి సత్పథాన్ని సూచిస్తాడు.

రామాయణంలో సీతమ్మ తల్లి జీవాత్మ. శ్రీరామచంద్రమూర్తి పరమాత్మ. పరమాత్మను జీవాత్మ చేరునట్లు ప్రయత్నించిన ఆచార్యుడు హనుమంతుడు. అణు మాత్రం స్వార్థదృష్టి లేక, అంతఃకరణ శుద్ధితో ఉపదేశించే వారు ఔపదేశిక గురువులు. అత్రి, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, వ్యాసాదులు ఈ కోవలోని వారే. మరో రకం గురువులు కుల గురువులు. దేవతల గురువు బృహస్పతి. దైత్యుల గురువు శుక్రాచార్యుడు. సూర్యవంశజుల గురువు వశిష్టుడు. వీళ్లంతా కుల గురువులే. మనకు బాగా తెలిసిన వారు విద్యా గురువులు. విద్యా గురువులనగానే గుర్తుకు వచ్చేవాడు ద్రోణుడు. 

జగద్గురువైన శ్రీకృష్ణుడు సాందీపని శిష్యుడు. ఇంకో రకం గురువులు మత గురువులు. ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంత స్థాపకులు. ధర్మస్థాపనలో భరతజాతిని ఏకతాపథంపై నిలిపిన విప్లవవాది. విశిష్టాద్వైత ప్రచారకులు భగవద్రామానుజులు. ద్వైత సిద్ధాంతావలంబకులు మధ్వాచార్యులు. వీరశైవ మతావలంబకులు బసవేశ్వర స్వామి. వీరంతా చారిత్రక గురు పరంపరలోని వారు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, అరవిందుడు, రమణ మహర్షి, చిన్మయానంద లాంటివారు ఆ తర్వాతి కాలంలో వెలిగిన ఆచార్యదీప్తులు. 

అన్ని బంధాలకంటే, రక్తసంబంధం కంటేకూడా ‘ఆచార్య శిష్య బంధం’ ఎంతో అపురూపం. అతి పవిత్రం. ఆనాటి గురుశిష్యుల బంధాలు ఈతరం వారికి అర్థం కావు. భౌతిక విద్య అవసరమే. పారమార్థిక విద్యపట్ల అవగాహన కూడా అవసరమని నొక్కి చెప్పాల్సింది ఆచార్యుడే. ఈనాటి చదువుల్లోని సారాన్ని, అర్థాన్ని అందిస్తూనే, నైతికత, భారతీయత, సనాతన వాఙ్మయ పరిచయం ద్వారా జ్ఞానబోధ, ధర్మబోధ, సేవా దృక్పథం, పరోపకార గుణం మున్నగు వాటిని శిష్యులకు ఆచార్యులు తార్కికంగా, విశ్లేషణాత్మకంగా బోధిస్తూ, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వుంది. తన వృత్తి ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వర్తించేవాడే నిజమైన ఆచార్యుడు. అలాంటి ఆచార్యుడే ఆరాధ్యదైవం!!logo