తిరుమల : బిహార్ రాజధాని పాట్నా ( Patna ) సమీపంలో గంగా నది తీరానికి దగ్గరగా, జాతీయ రహదారి పక్కన శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం బిహార్( Bihar ) ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ( Chairman BR Naidu ) బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ( CM Samrat Choudhary ) ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించి, శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. ఈ సమావేశంలో బీహార్ చీఫ్ సెక్రటరీ అమృత్ ప్రత్యయ్ పాల్గొన్నారు. ప్రతిపాదిత ఆలయ ప్రాంగణంలో ప్రధాన దేవాలయంతో పాటు కళ్యాణ మండపం, పుష్కరిణి, యాత్రికుల సౌకర్యాలకు అవసరమైన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం ద్వారా సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తరించాలనే లక్ష్యంతో టీటీడీ ముందుకు సాగుతోందని చైర్మన్ వెల్లడించారు.
ఈ క్రమంలో అన్ని రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో కార్యాచరణ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 10 ఎకరాల భూమి కేటాయింపు పూర్తి అయ్యిందని తెలిపారు. ఉత్తర భారత భక్తులకు తిరుమల శ్రీవారితో అనుబంధాన్ని మరింత పెంచడంతో పాటు, ఈ ఆలయం భవిష్యత్తులో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోందని వెల్లడించారు.