శ్రీబాలాజీ జిల్లా : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గత రెండు రోజులతో పోల్చితే ఆదివారం భక్తుల సంఖ్య మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆదివారం ఉదయం క్యూలైన్ టీబీసీ కాంప్లెక్స్ వరకు ఉన్నది. ఫలితంగా భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 12 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. ఆదివారం కావడంతో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో శ్రీవారి దర్శనానికి వచ్చారు.
శనివారం తిరుమల శ్రీవారిని 84,885 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,221 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లుగా ఉన్నదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని, క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదంతో పాటు మంచినీరు సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు.
మరోవైపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. రెండేండ్ల తర్వాత మాడ వీధుల్లో బ్రహ్మోత్సవాల వాహనసేవలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు.