అది గలీలియా సముద్ర తీరం. ఆ ఇసుక రేణువులపై ప్రభువు నడచి వస్తున్నాడు. జాలరులు చేపల వేట కోసం సన్నాహాలు చేస్తున్నారు. తెగిన వలలు గట్టిగా ముడి వేసుకొంటున్న వారిలో ఓ పెద్దాయన ఉన్నాడు. పేరు సీమోను. ఆయనకే మరో పేరు పేతురు. ఆయనకో తమ్ముడు. పేరు ఆంద్రియా. ఆ తమ్మునితోపాటు వలలు సిద్ధం చేసే పనిలోనే నిమగ్నమైపోయాడు పేతురు. అంతలో, చల్లగా ఓ పిలుపు. ‘నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను’ అని వినిపించింది. అక్కడివారు ప్రభువును చూశారు. ‘ఏమిటీ? ఎందుకు?’ అనే ప్రశ్నలకు తావు లేకుండానే, వెంటనే తమ వలలు విడిచిపెట్టి ఏసుతో పాటు వెళ్లిపోయారు.
ఈ సంఘటన తొలి శిష్యరిక ప్రయాణానికి నాంది పలికింది. అలా ఆ మహనీయునితోపాటు వెళ్లాలంటే, తమ గత జీవన విధానానికి స్వస్తి పలకాలి. మరో సందర్భంలో జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను ఇద్దర్నీ ప్రభువు ఇలాగే పిలిచాడు. వెంటనే వారు తమ దోనెను తండ్రికి విడిచిపెట్టి ప్రభువు వెంట నడిచారు. ఏ చదువూ సంధ్యా లేని సామాన్యుల్ని తనకు శిష్యులుగా రావాలని కోరుకున్న ప్రభువు అభిమతంలో గొప్ప విశ్వ జనీనమైన సార్వత్రిక సందేశం ప్రత్యేకించి వెదకాల్సిన పనిలేదు కదా!