రాయి, రప్ప, చెట్టు, పుట్టనేగాక అనేక జీవరాశులను దైవంగా భావించి ఆరాధించడం హైందవ సంస్కృతిలో భాగం. ప్రకృతిని దైవంగా భావించే మనం ప్రకృతిలో మమేకమై జడ, జీవపదార్థాలను సైతం దైవంగానే భావిస్తాం. భారతీయ సంస్కృతి విశిష్టత ఇదే. ఈ క్రమంలోనే నాగులను దేవుళ్లుగా పూజిస్తాం. కార్తిక శుద్ధ చతుర్థిని నాగులచవితిగా పండుగ చేసుకుంటాం. కొన్ని చోట్ల శ్రావణ శుద్ధ చవితి నాడు ఈ పండుగ చేసుకుంటారు.
నాగులచవితి నాడు సూర్యోదయానికి ముందుగానే మహిళలు స్నానాదులు ముగించుకొని పుట్ట దగ్గరికి వెళ్తారు. పుట్ట చుట్టూ పసుపురాసిన నూలు దారాలు చుట్టి, ప్రమిదలు వెలిగించి, పుట్టపై పసుపు కుంకుమ చల్లుతారు. నాగదేవతను కీర్తిస్తూ పాటలు పాడి అగరువత్తులతో ధూపం సమర్పించి పూజ చేస్తారు. ఫల హారాలను నైవేద్యంగా సమర్పిస్తారు. చిక్కని ఆవుపాలను భక్తితో నివేదిస్తారు. మొక్కులు చెల్లించుకుంటారు.
తొమ్మిది రంధ్రాలు గల మానవదేహాన్ని పుట్టతో పోలుస్తారు. మానవ శరీరం ఎప్పటికైనా మట్టిలోనే కలసిపోతుందనే సత్యాన్ని గుర్తుచేస్తుంది పుట్ట. అందులో ఉండే నాగదేవత మన ప్రాణానికి ప్రతిరూపం. దేవాలయాల్లో మూల మూర్తులకు నాగాభరణాలను అలంకరించడం మనం చూస్తూనే ఉంటాం. హరిహరులకు నాగజాతి అంటే అమితమైన ప్రేమ. అందుకే శ్రీమహావిష్ణువు పాలకడలిలో శయనించడానికి ఆదిశేషుడిని తన పాన్పుగా మలచుకున్నాడు. పరమశివుడు వాసుకిని తన కంఠహారంగా ధరించాడు. శివతత్వాన్ని ఆదర్శంగా తీసుకునే బ్రహ్మదేవుడు మానవ దేహాన్ని తయారుచేశాడనే యోగపరమైన భావన ఉన్నది.
మానవ శరీరంలో 72 కోట్ల నాడులు వ్యాపించి ఉన్నాయి. ఒక్కో నాడి ఒక్కో నాగుకు ప్రతీక. 72 కోట్ల నాడులు వెన్నుపాములో ఉన్న కుండలినీ శక్తికి అనుసంధానమై ఉంటాయి. మూలాధార చక్రంలో మూడు చుట్టలు చుట్టుకొన్న రెండు మహాకాలసర్పాలు నిద్రాణస్థితిలో ఉన్న కుండలినీ శక్తికి ప్రతీక. ఇదే శక్తి వెన్నెముకలో సుషుమ్ననాడి రూపంగా పైకి, కిందికి సంచరిస్తూ ఉంటుంది. వెన్నెముకను యోగపరంగా ‘వీణాదండం’ అని, ‘వెన్నుపాము’ అని పిలుస్తారు. పుట్ట మన దేహం. అందులోని నాగదేవత మనలోని కుండలినీ శక్తికి ప్రతీక. పుట్టకు చుట్టినవి వడికిన నూలుపోగులైతే, దేహంలోని నాడులు వడకని పోగులు. ఇలా పంచభూతాత్మకమైన మానవ శరీరం నాగులచవితికి ప్రతీకగా భావించవచ్చు. నాగులచవితి రోజు మాత్రమే నాగదేవతకు పూజచేసి సరిపెట్టుకోకూడదు. పుట్టలోని నాగదేవత మనలో కుండలినీ శక్తిగా ఉన్నది. నిత్యం ధ్యానం, ప్రాణాయామంతో మనలోని నాగశక్తిని పూజించాలన్నది నాగులచవితి పండుగ పరమార్థం.
ఇదేరోజు షట్చక్రాలకు ప్రతీకగా భావించే షణ్ముఖుణ్ని కూడా మహిళలు విశేషంగా ఆరాధిస్తారు. సత్సంతానం కలగాలనీ, తమ పిల్లలు ప్రయోజకులు కావాలనీ షణ్ముఖుణ్ని మనసారా కోరుకుంటారు. అనాదిగా నాగదేవతల ఆరాధన దేశంలోని అన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నది. అసోం రాజధాని గువాహటిలోని శక్తిపీఠం కామాఖ్యదేవి ఆలయానికి కొంతదూరాన దట్టమైన అడవిలో ఓ కొండపై మానసాదేవి ఆలయం ఉంది. ఈ క్షేత్రంలో నాగులచవితి పండుగ ఘనంగా జరుగుతుంది. నాగులచవితి నాడు ఆలయ పరిసరాల్లో వందలాది సర్పాలు దర్శనమిస్తాయి. పడగ విప్పి మానసాదేవి ఆలయం వంక చాలాసేపు తదేకంగా చూస్తూ ఉంటాయి. ఈ విచిత్రాన్ని చూడటానికి భక్తులు అనేక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటారు. ఇలాంటి మహిమాన్విత ఆలయాలను నాగులచవితి రోజు దర్శించుకోవడం పుణ్యప్రదం.
నాగసర్పం ఒకసారి గాలి పీల్చుకుంటే కొన్ని గంటలపాటు దానికి గాలితో అవసరం ఉండదు. అందుకే సర్పాలు ఎక్కువకాలం జీవిస్తాయని చెప్తారు. నాలుకను లోనికి మడిచి అంతర్ కుంభకం పడతాయి సర్పాలు. ఈ విధానాన్ని యోగపరంగా ఖేచరిముద్ర అంటారు. ఈ ముద్రకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. నాగ సాధువులు కూడా ఈ యోగ ప్రక్రియనే అనుసరిస్తుంటారు. ఇలా భక్తి జ్ఞాన యోగమార్గాలను అనుసరించి ఎవరి శక్తి మేరకు వారు నాగుల చవితి పండుగను చేసుకుంటారు. మనలోని కుండలినీ శక్తిని చైతన్యపరచుకునే అవకాశం ఇచ్చేదే ఈ పండుగ.
-నూతి శివానందం 92471 71906