తిరుమల : ఆపద మొక్కుల వాడు, అనాథరక్షకుడు తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavams) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల నాలుగో రోజు శనివారం ఉదయం శ్రీమలయప్ప స్వామి ఉభయదేవేరులతో కలిసి రాజమన్నార్ ( Rajamannar ) అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తూ మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బోర్డు సభ్యులు, సీవీ ఎస్వో మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.