Edupayala Temple | తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా మెదక్ జిల్లాలోని చారిత్రక ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం వద్ద పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మంజీరా నదికి పోటెత్తిన భారీ వరద కారణంగా ఆలయ ప్రాంతం జలమయమైంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో ఏడుపాయల ఆలయం గత 15 రోజులుగా వరద నీటిలోనే చిక్కుకుపోయింది. సింగూరు ప్రాజెక్టు నుంచి ఏకంగా ఒక లక్షా 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో మంజీరా నదికి ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తింది. గత పదేళ్లలో ఏడుపాయల వద్ద ఇంతటి భీకర వరద రాలేదని స్థానికులు చెబుతున్నారు.
కొట్టుకుపోయిన షెడ్లు, నిలిచిపోయిన దర్శనాలు
వరద ప్రవాహం తీవ్రతకు ఆలయ ప్రాంగణంలో ఉన్న నిర్మాణాలకు భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా గర్భగుడి మండపం పైభాగంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన షెడ్డు పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది. అంతేకాకుండా ప్రసాదాల పంపిణీ కేంద్రం షెడ్డు కూడా నది ప్రవాహానికి ధ్వంసమై కొట్టుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రమాదకర స్థాయిలో నది ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఆలయానికి వెళ్లే మూడు ప్రధాన మార్గాలను పోలీసులు పూర్తిగా మూసివేశారు. భక్తులు ఎవరూ ఆలయ దర్శనానికి రావద్దని అధికారులు కఠినంగా హెచ్చరిస్తున్నారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి నుంచి ఏడుపాయలకు వెళ్లే మొదటి వంతెన వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే భక్తులు పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి మీదుగా మాత్రమే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని కొల్చారం పోలీసులు సూచించారు. మంజీరా నది ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికారులు, పోలీసులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.