Dry Red Chillies | ఎండు మిర్చిని మనం రోజూ వంటల్లో వేస్తూనే ఉంటాం. వీటితో కూరలు, పచ్చళ్లు చేస్తుంటారు. చారు, రసం వంటి వాటి తయారీలోనూ ఎండు మిర్చిని ఉపయోగిస్తారు. పులిహోరలో వేసే ఎండు మిర్చి ఎంతో రుచిగా ఉంటుంది. ఘాటు కావాలని కోరుకునే వారు ఎండు మిర్చిని ఎక్కువగా తింటుంటారు. ఎండు మిర్చి వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి, రంగు, వాసన వస్తాయి. అయితే ఎండు మిర్చి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఎండు మిర్చిలో క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రోగాలను నయం చేయడంలో సహాయం చేస్తుంది. ఎండు మిర్చిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. వీటిని తింటుంటే పలు వ్యాధులు నయం అవుతాయని అంటున్నారు.
ఎండు మిర్చిలో అధికంగా ఉండే క్యాప్సెయిసిన్ కారణంగా బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. క్యాప్సెయిసిన్ వల్ల శరీరం వేడెక్కి మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు త్వరగా కరిగిపోతుంది. ఫలితంగా అధిక బరువు వేగంగా తగ్గుతారు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తున్నవారు ఎండు మిర్చిని తింటుంటే ప్రయోజనం ఉంటుంది. ఎండు మిర్చిలో ఉండే క్యాప్సెయిసిన్ కారణంగా నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. కనుక ఎండు మిర్చిని తింటే శరీరంలోని నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎండు మిర్చిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ట్రై గ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. గుండె సంబంధిత వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఎండు మిర్చిలో విటమిన్ సి కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ఎండు మిర్చిలో విటమిన్ సితోపాటు కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రాణాంతక వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. ఎండు మిర్చిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీని వల్ల జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి తగ్గుతుంది.
100 గ్రాముల ఎండు మిర్చిలో 318 క్యాలరీల శక్తి ఉంటుంది. పిండి పదార్థాలు 57 గ్రాములు, ఫైబర్ 25 గ్రాములు, ప్రోటీన్లు 12 గ్రాములు, కొవ్వులు 17 గ్రాములు ఉంటాయి. అలాగే విటమిన్లు సి, బి6, ఎలతోపాటు ఐరన్, పొటాషియం వంటి పోషకాలు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఎండు మిర్చిని రోజుకు 1 తినవచ్చు. అంతకు మించి తింటే జీర్ణాశయంలో యాసిడ్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో అసిడిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే అల్సర్లు, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారు ఎండు మిర్చిని తినకూడదు. లేదంటే ఆయా సమస్యలు మరింత ఎక్కువవుతాయి. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ ఎండు మిర్చిని తింటుంటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.