అహ్మదాబాద్ : తనతో ఫ్రెండ్షిప్ కొనసాగించడం లేదనే ఆగ్రహంతో బాలిక(17)ను వెంబడించి వేధిస్తున్న యువకుడిపై గుజరాత్‌లోని యోగినగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు దర్శన్ వెకరియ బాలిక ఇంటినుంచి బయటకు వచ్చిన ప్రతిసారి ఆమెను వెంబడించి వేధిస్తున్నాడు. ఆమె సోదరుడిపై దాడి చేస్తానని కూడా నిందితుడు బెదిరించేవాడు.
బాలికతో మాట్లాడేందుకు ఆమె ఫ్రెండ్‌కు పోన్ చేసి బాలికతో మాట్లాడించాలని కోరేవాడు. కొద్దిరోజుల కిందట బాలికతో స్నేహం పెంచుకున్న యువకుడు ఇటీవల ఆమె అతడిని దూరం పెట్టడంతో వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆదివారం బాలిక పాలు కొనేందుకు బయటకు వచ్చిన సమయంలో వెంబడించిన నిందితుడు వేధింపులకు గురిచేస్తుండగా ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది.
నిందితుడితో బాలిక స్నేహంగా ఉండటాన్ని గమనించిన బాలిక తల్లి చదువుపై దృష్టి పెట్టాలని మందలించడంతో దర్శన్‌కు దూరంగా ఉంటోందని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడు బాలికను వెంబడించి వేధిస్తున్నాడని చెప్పారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.