వినాయక నగర్ : నిజామాబాద్ ( Nizamabad ) జిల్లాలో వడ్డీ వ్యాపారుల ( Moneylender ) వేధింపులు భరించలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వృత్తిరీత్యా ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న యువకుడు తన అవసర నిమిత్తం ఓ మహిళ వద్ద డబ్బులు అప్పుగా తీసుకున్నందుకు వారి వేధింపులు అధికమవడంతో తీవ్ర మనస్థాపన చెంది శనివారం మృత్యువాత పడ్డాడు. బాధితుని బంధువులు తెలిపిన మేరకు వివరాలు ..
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం ముషీర్నగర్కుచెందిన మనోహర్ ( Manohar) అనే యువకుడు భార్యతో కలిసి నిజామాబాద్లో నివాసముంటున్నాడు. తన అవసరాల కోసం నాందేవ్ వాడకు చెందిన జ్యోతి అనే మహిళ వద్ద ఆరు నెలల క్రితం రూ.40 వేల రూపాయలు అప్పుగా ( Loan ) తీసుకున్నాడు. రూ. 80వేలు చెల్లించాలని మనోహర్ పై ఒత్తిడి చేసింది.
మహిళకు చెందిన మనుషులు మనోహర్ ఇంటికి వెళ్లి బెదిరించడమే కాకుండా అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను బలవంతంగా తీసుకెళ్లారు . దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మనోహర్ నాలుగు రోజుల క్రితం గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించాడు.
తన కుమారుడు అవసరం నిమిత్తం తీసుకున్న డబ్బులను రెట్టింపు చేసి అధిక వడ్డీతో కట్టాలని వేధింపులకు పాల్పడడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.