బులంద్‌షెహర్: ఒకరికి చేయాల్సిన ఆపరేషన్ మరొకరికి చేసి సినిమాల్లో కామెడీ పండించడం మనకు తెలుసు. అదే నిజంగా జరిగితే? ఆ ఊహే భయంకరంగా లేదూ. కానీ ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్‌లో అదే జరిగింది. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన యూసుఫ్ అనే వ్యక్తికి అక్కడి డాక్టర్ గాల్‌బ్లాడర్ ఆపరేషన్ చేసేశాడు.
అదే పేరుతో ఉన్న మరో వ్యక్తికి ఆపరేషన్ చేయాల్సి ఉండగా పేషెంట్ విషయంలో పొరపాటు పడినట్లు వాళ్లు చెప్పారట. ఆపరేషన్ అనంతరం యూసుఫ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆ తర్వాత చికిత్స తీసుకుంటూనే అతను మరణించాడు. ఆపరేషన్ అనంతరం యూసుఫ్ శరీరంలో గాల్‌బ్లాడర్ లేదని తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
అవయవాలు కాజేయడానికే ఆపరేషన్ చేశారని ఆరోపించారు. ఆసుపత్రిలో వారు గొడవ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆసుపత్రికి చేరుకొని యూసుఫ్ మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. అనంతరం ఆపరేషన్ చేసిన వైద్యుడు, ఆసుపత్రి సిబ్బందిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.