Daring Manager | దొంగతనం చేసేందుకు బ్యాంకుకు వచ్చిన ఓ దొంగను.. మహిళా మేనేజర్ ధైర్యం చేసి చాకచక్యంగా పట్టుకున్నది. దొంగను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించింది. దీంతో బ్యాంకులోని దాదాపు రూ.37 లక్షల నగదు దొంగ పాలు కాకుండా కాపాడినట్లయింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో జరిగింది. బ్యాంకు సమయం ముగిసిన తర్వాత కూడా తెరిచివుంచడం, గార్డులు లేకపోవడంతో ఇలాంటి దొంగలకు వరంగా మారిందని చెప్పవచ్చు.
శ్రీగంగా నగర్లో రాజస్థాన్ మరుధర గ్రామీణ బ్యాంకు శాఖ ఉన్నది. శనివారం బ్యాంకు పనివేళల అనంతరం ఆఫీస్ పని చేస్తుండగా ఓ ఆగంతకుడు ముఖానికి టవల్ కట్టుకుని బ్యాంకులోకి వచ్చాడు. ఇది గమనించిన లోన్స్ విభాగం ఇంఛార్జీ ప్రదీప్ కుమార్ బయటకు వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించాడు. దాంతో బయటకు వెళ్లిపోయిన సదరు వ్యక్తి.. కొద్దిసేపటి తర్వాత తిరిగి బ్యాంకులోకి వచ్చి కత్తితో బెదిరిస్తూ నగదును బ్యాగులో పెట్టాల్సిందిగా ఆదేశించాడు. అందరి ఫోన్లు లాక్కుని ఒకవైపున నిలబెట్టిన ఆ వ్యక్తి.. ఛాంబర్లో ఉన్న మేనేజర్‌ను కూడా వచ్చి నిలబడాలని చెప్పాడు.
అప్పటివరకు కస్టమర్లతో మాట్లాడుతున్న బ్యాంకు మేనేజర్ పూనమ్ గుప్తా.. బయటకు వస్తూనే ఆగంతకుడితో కలియబడటం మొదలెట్టింది. దీంతో బిత్తరపోయిన ఆ వ్యక్తి పలాయనం చిత్తగించేందుకు చూశాడు. మిగతా సిబ్బందిని అప్రమత్తం చేసిన మేనేజర్.. మెయిన్ గేట్ మూసివేయించి దొంగను పట్టుకునేలా చేసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి దొంగను వారికి అప్పగించారు. దొంగను ఎదిరించడంతో బ్యాంకులోని రూ.37 లక్షల నగదు దొంగతనం కాకుండా కాపాడగలిగిందని సిబ్బంది మేనేజర్ పూనమ్ గుప్తాను అభినందించారు. నిందితుడిని దావ్డా కాలనీకి చెందిన లావిష్ అలియాస్ టిషు అరోరాగా గుర్తించారు. దొంగ కత్తితో బెదిరించినా ధైర్యం తెచ్చుకుని ఎదిరించానని మేనేజర్ పూనమ్ గుప్తా చెప్పారు.