న్యూఢిల్లీ: ఒక మహిళ, క్యాబ్ డ్రైవర్ చెంప చెళ్లుమనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అయితే రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉండటంతో వారి వాహనానికి ఒక క్యాబ్ డ్రైవర్ దారి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన టీ షర్టు ధరించిన మహిళ క్యాబ్ డ్రైవర్‌ను కారు నుంచి బయటకు లాగింది. అందరూ చూస్తుండగా చొక్కా పట్టుకుని దూషిస్తూ అతడి చెంపపై కొట్టింది. అక్కడున్న కొందరు సర్ది చెప్పేందుకు యత్నించగా వారిపై కూడా ఆ మహిళ విరుచుకుపడింది.
కాగా, కొందరు ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఆదిత్య సింగ్ అనే ట్విట్టర్ యూజర్ దీనిని పోస్ట్ చేశారు. ఈ ఘటన చూసి తాను చాలా బాధపడినట్లు అందులో పేర్కొన్నారు.
మరోవైపు క్యాబ్ డ్రైవర్ నుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం. అయితే ద్విచక్ర వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసిన మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.