న్యూఢిల్లీ : గత కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతున్నారు. రోజుకో స్కామ్ పేరుతో అమాయకుల ఖాతాల నుంచి ఆన్లైన్ వేదికగా లక్షలు స్వాహా చేస్తున్నారు. లేటెస్ట్గా గురుగ్రాంకు చెందిన ఓ మహిళను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. నగరంలోని హౌసింగ్ బోర్డ్ సొసైటీకి చెందిన ప్రాచీ శర్మ ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో నివసిస్తుండగా మే 3న గుర్తుతెలియని వ్యక్తి నుంచి స్కైప్ కాల్ వచ్చింది.
తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని వారు పరిచయం చేసుకున్నారు. ఆమె పేరుతో ఎయిర్‌పోర్ట్‌కు ఓ పార్సిల్ వచ్చిందని నమ్మబలికారు. ఆ పార్సిల్లో డ్రగ్స్, విదేశీ కరెన్సీ ఉన్నాయని బెదిరించారు. దీనిపై విచారణ జరుగుతోందని చెప్పిన దుండగులు తాము ఐపీఎస్ అధికారులు బాల్ సింగ్ రాజ్పుట్, స్మితా పటేల్ అని చెబుతూ కాల్లో ఐడెంటిటీ కార్డులు చూపించారు.
మహిళ తన బ్యాంక్ ఖాతా వివరాలను తమకు అందించి విచారణకు సహకరించాలని కోరారు. ఆపై ఆమెపై మనీల్యాండరింగ్, ఇతర ఆరోపణలు ఉన్నాయని బెదిరించారు. రూ. 8.4 లక్షలు చెల్లిస్తే కేసు నుంచి తప్పిస్తామని మభ్యపెట్టారు. తమ కుటుంబం పరువు పోతుందనే భయంతో బాధితురాలు వారి అడిగిన మొత్తం ట్రాన్స్ఫర్ చేశారు. ఆపై స్కామర్లు ఆమె కాంటాక్ట్‌ను బ్లాక్ చేయడంతో మోసపోయానని భావించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read More :
Kavin | తమిళ హీరో ఇంట పెళ్లి భాజాలు.. ప్రేయసిని పెళ్లాడబోతున్న నటుడు