లక్నో : యూపీలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలకు ట్రేక్ పడటం లేదు. మహిళకు మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి అనంతరం ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన మీరట్ జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని రోహ్త ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. కలకలం రేపిన ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లైంగిక దాడి కేసులో నిందితుల్లో ఒకరైన రోహ్తాకు చెందిన అమర్‌పాల్ రాస్నా ప్రాంతంలో హోటల్ నడుపుతున్నాడు.
హోటల్ ఫస్ట్ ఫ్లోర్లో అమర్‌పాల్ కుమారుడు ఉజ్వల్ జిమ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. శుక్రవారం సాయంత్రం ఉజ్వల్ స్నేహితులు ఇద్దరు ఓ మహిళను హోటల్‌కు తీసుకువచ్చారు. వారు ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారు. ఆపై ఆమె స్పృహ కోల్పోగా సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. ఆమె మెలకువ రాగానే తన బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు నిందితులను స్పాట్లో అరెస్ట్ చేశారు.
ఇద్దరు నిందితులను జిమ్ ఓనర్ ఉజ్వల్, అతడి స్నేహితుడు సౌరభ్‌గా పోలీసులు గుర్తించారు. మూడవ నిందితుడు మోను కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని జైలుకు పంపిన పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధిత మహిళను దవాఖానకు తరలించారు.