ముంబై : ప్రియుడితో కలిసి నివసించేందుకు అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు భార్య దారుణానికి పాల్పడింది. భర్తను చంపేందుకు కిరాయి హంతకులకు సుపారీ చెల్లించడం కోసం ఆమె ఏకంగా తన మంగళసూత్రాన్నే తాకట్టు పెట్టింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రుతి గంజి అనే మహిళ తన భర్త హత్య కోసం సుపారీ చెల్లించేందుకు తన మంగళసూత్రం తాకట్టుపెట్టి రూ లక్ష సేకరించగా, ఆపై ఫిక్స్డ్ డిపాజిట్‌ను డ్రా చేసి మరో రూ 3 లక్షలు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేసింది.
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి జీవించేందుకు భర్త ప్రభాకర్ నుంచి విడిపోవాలని ఆమె నిర్ణయించుకోగా శ్రుతికి విడాకులిచ్చేందుకు అతడు నిరాకరించాడు. భర్త ప్రభాకర్‌కు మరో మహిళతో సంబంధం ఉండటం కూడా శ్రుతికి వైవాహిక బంధంపై విరక్తి కలిగింది. దీంతో ప్రియుడు హితేష్ వాలాతో మాట్లాడిన శ్రుతి భర్తను మట్టుపెట్టేందుకు నిర్ణయించింది. ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ కిల్లర్ సంతోష్ రెడ్డిని సంప్రదించారు.
ముందుగా వేసుకున్న పధకం ప్రకారం భివాండి నుంచి ఐరోలి వరకూ ప్రభాకర్ ట్యాక్సీని రెడ్డి ఆయన సహచరులు బుక్ చేసుకున్నారు. ట్యాక్సీ మంకోలి ప్రాంతానికి చేరుకోగానే కారు ఆపమని కోరిన నిందితులు ఆపై ప్రభాకర్ మెడకు నైలాన్ తాడుతో ఉరి బిగించి ఊపిరాడకుండా చేసి ఉసురుతీశారు. దర్యాప్తులో భాగంగా శ్రుతి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో హత్య గుట్టు రట్టయింది. నిందితులు సంతోష్‌రెడ్డి, శ్రుతి, ఆమె ప్రియుడు హితేష్‌తో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.