న్యూఢిల్లీ : మహిళను లైంగిక వేధింపులకు గురిచేసి ఆమె కుటుంబ సభ్యులను హింసించిన ఘటన అవుటర్ ఢిల్లీలోని షాబాద్ డైరీ ప్రాంతంలో వెలుగుచూసింది. మార్చి మొదటి వారంలో ఈ ఘటన జరగ్గా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
మార్చి 14న మహిళ, ఆమె కుటుంబ సభ్యులకు పొరుగింటి వ్యక్తులతో వివాదం నెలకొంది. దీంతో మహిళను పొరుగింటి వారు లైంగికంగా వేధించారు. ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో తొమ్మిది మంది గాయపడ్డారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వైరల్ వీడియోలో మహిళను కర్రలతో కొడుతున్న దృశ్యాలు కనిపించాయి.
ఆమెను కాపాడేందుకు కుటుంబసభ్యులు కల్పించుకోగా వారిని కూడా నిందితులు గాయపరిచారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. మహిళను వేధించిన వ్యక్తితో పాటు ఇప్పటివరకూ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.