Karnataka : కర్ణాటకలోని దావనగరె పరిధిలో దారుణం జరిగింది. పెళ్లైన మూడు నెలలకే భార్య తన ప్రియుడితో వెళ్లిపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు.. ఈ ఘటన గురించి తెలిసి ఆమె బావ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, మీడియా కథనాల ప్రకారం.. గుమ్మనూర్ గ్రామానికి చెందిన హరీష్ (30).. హులికట్టె గ్రామానికి చెందిన సరస్వతి అనే మహిళను మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు.
అయితే, ఈ నెల 23న హరీష్ భార్య సరస్వతి.. తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. దీంతో సరస్వతి, ఆమె తండ్రి, వారి బంధువులు హరీష్నే ఈ ఘటనకు బాధ్యుడిని చేశారు. అంతేకాదు.. అతడిని బెదిరించారు. ఇదే సమయంలో రెండు రోజుల తర్వాత, ఆదివారం సరస్వతిని కుటుంబ సభ్యులు గుర్తించి తీసుకొచ్చారు. కానీ, హరీష్.. భార్య ప్రియుడితో వెళ్లిపోయిన అవమాన భారం, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేకపోయాడు. సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు భార్య, ఆమె తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులే కారణమని సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరాడు.
ఇదే సమయంలో, వారి పెళ్లికి కారణమైన సరస్వతి బావ రుద్రేష్ (36) కూడా విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. హరీష్ ఆత్మహత్యపై అతడి తండ్రి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరస్వతి, ఆమె కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.