అహ్మదాబాద్ : మహిళ (56)ను వెంబడించి ఆమె పట్ల అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్న వ్యక్తి(45)ని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత నాలుగైదు నెలలుగా మహిళను వేధిస్తున్న వ్యక్తిని బుధవారం రాత్రి స్ధానికుల సహకారంతో పట్టుకున్నారు. గుజరాత్ ప్రభుత్వ న్యాయవాదుల ప్యానెల్లో సభ్యురాలైన మహిళ భర్తతో కలిసి వస్నాలో నివసిస్తోంది. బుధవారం రాత్రి తలుపు పగలగొట్టి ఎవరో లోపలికి వస్తున్న అలికిడిని విన్న మహిళ భర్త బయటకు రాగా ఆయనను చూసి నిందితుడు పరారయ్యాడు.
సెక్యూరిటీ గార్డును, స్ధానికులను మహిళ అప్రమత్తం చేయగా చాముండనగర్ ప్రాంతంలో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఏడాది జులైలో కూడా ఈ వ్యక్తి తమ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడని మహిళ గుర్తించారు. వ్యక్తిని వెజలాపూర్కు చెందిన సంజయ్ బరైయాగా పోలీసులు గుర్తించారు. నిందితుడు గతంలోనూ తన పట్ల అసభ్యంగా వ్యవహరించాడని, అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.