Kochi Arrests | కొచ్చిలో ఓ యువతిపై సామూహిక లైంగికదాడి జరిపిన కేసులో నలుగురు వ్యక్తులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. వృత్తిరీత్యా మోడల్‌గా ఉన్న యువతిపై శుక్రవారం రాత్రి సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ ఘటనలో 19 ఏళ్ల మోడల్ ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం వీరిని సౌత్ ఎర్నాకుళం పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలిని పోలీసులు స్థానిక దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసర్‌గోడ్‌కు చెందిన 19 ఏండ్ల మోడల్.. డింపుల్ లాంబా ఆహ్వానం మేరకు డ్యాన్స్ పార్టీ కోసం కొచ్చిలోని ఓ బార్‌కు వెళ్లింది. బార్లో మరో ముగ్గురు వ్యక్తులు వారితో చేరారు. అక్కడ డ్రింక్స్ తీసుకున్న తర్వాత ఆమె మత్తులోకి జారుకున్నది. ఆ యువతిని వారు తమ ఎస్‌యూవీలో తీసుకెళ్లి నగరంలో తిప్పుతూ కదులుతున్న సమయంలోనే ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను కాసరగోడ్‌లోని ఆమె నివాసం వద్ద వదిలేసి వెళ్లిపోయారు.
బాధితురాలి స్నేహితురాలు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించింది. ఇన్ఫోపార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసును ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అరెస్ట్ అయిన వారు కొడంగల్లూరుకు చెందిన నితిన్, సుధీ, వివేక్‌తోపాటు రాజస్థాన్‌కు చెందిన డింపుల్ లాంబా. వీరిపై లైంగికదాడి, అపహరణ, నేరపూరిత కుట్ర అభియోగాలపై కేసు నమోదు చేసి సౌత్ ఎర్నాకుళం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.