Bhagya Shree borse | ఈ ఏడాది టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్న సినిమాల్లో ‘లెనిన్’ కూడా ఒకటిగా నిలిచింది. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ చిత్రం ఇద్దరి కెరీర్లోనూ కీలకంగా మారింది. చాలాకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్, భాగ్యశ్రీలకు ఈ సినిమా మంచి కంబ్యాక్‌ను అందించింది. ముఖ్యంగా ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘లెనిన్’ తర్వాత ఆమెకు టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు వస్తాయని భావించిన సమయంలోనే ఈ బ్యూటీ మరో భారీ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకున్నారు. అది కూడా మాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్‌లాల్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కావడం విశేషం.
మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కనున్న భారీ చిత్రం ‘ఆపరేషన్ గంగ’లో భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రలో నటించనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ద్వారా ఆమె మలయాళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ‘లెనిన్’తో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న భాగ్యశ్రీ.. ఇప్పుడు మోహన్‌లాల్ లాంటి సీనియర్ స్టార్‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకోవడంతో ఆమె కెరీర్‌కు ఇది మరో కీలక మలుపుగా మారనుంది.అయితే సినిమాలో ఆమె పోషించబోయే పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. దీంతో మోహన్‌లాల్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది? ఆమె పాత్ర కథలో ఎంత కీలకంగా ఉండబోతోంది? అనే ఆసక్తి నెలకొంది.
‘ఆపరేషన్ గంగ’ సినిమాను దర్శకుడు విష్ణు మోహన్ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనను నేపథ్యంగా తీసుకుని తెరకెక్కుతున్న సినిమా కావడంతో కథపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. భారీ స్థాయిలో రూపొందించనున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నారు? దర్శకుడు విష్ణు మోహన్ కథను ఏ విధంగా తెరపై ఆవిష్కరించబోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. ‘ధురంధర్’ వంటి భారీ చిత్రానికి సంగీతం అందించిన సస్వత్ సింగ్ సచ్ దేవ్ ‘ఆపరేషన్ గంగ’కు మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. మొత్తానికి.. ‘లెనిన్’తో సక్సెస్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సేకు మోహన్‌లాల్‌తో కలిసి నటించే ఛాన్స్ రావడం ఆమె కెరీర్లో మరో బిగ్ మూవ్‌గా మారింది.