WhatsApp : వాట్సాప్‌తో సత్వరమే బాధిత మహిళలను చేరుకుంటున్న పోలీసులు
హైదరాబాద్ : మహిళలు, యువతులను ఆపద సమయంలో కాపాడటంలో ముందున్న సైబరాబాద్ పోలీసుల షి టీమ్స్ లైంగిక వేధింపుల బాధితులను వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌ల ద్వారా సత్వరమే చేరుకుంటున్నాయి. పోలీసులు, ఫిర్యాదుదారుల మధ్య మెసేజింగ్ సేవలు వారధిలా పనిచేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్ నెలలో వచ్చిన 200 ఫిర్యాదుల్లో 121 ఫిర్యాదులు వాట్సాప్ ద్వారా రాగా, మిగిలిన ఫిర్యాదుల్లో 51 నేరుగా వచ్చాయి.
నాలుగు ఫిర్యాదులు హాక్ ఐ యాప్ ద్వారా, మరో 9 ఫిర్యాదులు విమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా స్వీకరించారు. ఇక 8 పిర్యాదులు ఈమెయిల్స్ ద్వారా నాలుగు ఫిర్యాదులు క్యూఆర్ కోడ్ స్కాన్ సిస్టం ద్వారా వచ్చాయి. భయం, బిడియం వంటి కారణాలతో ఏ ఒక్క బాధితురాలూ ఫిర్యాదు చేసేందుకు వెనకాడరాదన్నదే తమ లక్ష్యమని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. వాట్సాప్ రాకతో ఆన్లైన్ పద్ధతి అందుబాటులోకి రావడంతో అప్పటికే భయాందోళనలో ఉన్న బాధితులు ఫిర్యాదు చేసే ప్రక్రియ సులభతరంగా మారిందని చెప్పారు.
ఇక గత నెలలో వచ్చిన ఫిర్యాదుల్లో 50 ఫోన్ వేధింపులకు సంబంధించినవి కాగా 19 వాట్సాప్ ద్వారా వేధింపులకు సంబంధించినవి ఉన్నాయి. గృహ హింసకు సంబంధించి 31 ఫిర్యాదులు రాగా, వెంటపడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని 19 ఫిర్యాదులు, 16 బ్లాక్‌మెయిలింగ్, వేధింపుల ఫిర్యాదులు, పెండ్లి పేరుతో అభ్యంతరకర ప్రవర్తనకు సంబంధించి 10 ఫిర్యాదులు రాగా, అశ్లీల కంటెంట్ పంపుతున్నారని 9 ఫిర్యాదులు, సోషల్ మీడియా ద్వారా వేధింపులకు సంబంధించి ఐదు ఫిర్యాదులు అందాయని అధికారులు చెప్పారు.
సైబరాబాద్‌లో పనిచేస్తున్న 11 షీటీమ్స్ వాట్సాప్, ట్విటర్, క్యూఆర్ కోడ్, ఈమెయిల్ వంటి సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఫిర్యాదుదారులున్న ప్రదేశంలో షిటీమ్స్ ఫిర్యాదులు స్వీకరిస్తున్నాయి. ఫిర్యాదుల తీవ్రత ఆధారంగా వాటిపై షిటీమ్స్ వేగంగా స్పందించి పరిష్కరిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారులు ఓ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. గత నెలలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన మీదట 13 ఎఫ్ఐఆర్లు, 20 పెట్టీకేసులు సహా 33 కేసులు నమోదు చేశారు. 130 మందికి కౌన్సెలింగ్ ఇవ్వగా ప్రవర్తన మార్చుకోవాలని 62 మందిని హెచ్చరించారు.
ఇదే సమయంలో షిటీమ్స్ దాడుల్లో 44 మంది పట్టుపడగా వారిపై కేసులు నమోదు చేశారు. మూడు బాల్య వివాహాలను అడ్డుకున్నారు. ఇక మహిళలు ఏ రకమైన వేధింపులకు గురైనా 9490617444 వాట్సాప్ నెంబర్‌కు మెసే్ చేయడంతో పాటు డివిజనల్ షి, డయల్ 100కు నేరుగా కాల్ చేయడం ద్వారా షీటీమ్స్‌ను సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు. sheteam.cyberabad@gmail.comకు మెయిల్ చేయవచ్చని లేదా Twitter (@sheteamcybd), Facebook (Women and ChildrenSafetyWing) and Instagram (womenandchildrensafetywingcybd)ను సంప్రదించవచ్చని ప్రకటనలో తెలిపారు.