Road Accident | జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సావాన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న పికప్ వ్యాన్ ఒకటి బోల్తా పడటంతో ఏడుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కూలీలను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నాను. ఈ ఘటన గురువారం ఉదయం జార్ఖండ్‌లోని రాజ్‌నగర్ పీఎస్ పరిధిలోని ఖైర్బానీ గ్రామ సమీపంలో జరిగింది.
స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మృతదేహాలను రాజ్‌నగర్‌లోని ప్రభుత్వ దవాఖానలో పోస్ట్‌మార్టం జరుపుతున్నారు. అతివేగంగా ఉన్న వ్యాన్‌ను లక్డా కొచ్చా మలుపు వద్ద తిప్పేందుకు డ్రైవర్ ప్రయత్నించి విఫలం కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. వ్యాను క్యాబిన్‌పైన కూడా కూలీలు కూర్చున్నారని స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోవడం పట్ల సీఎం హేమంత్ సోరేన్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున మెరుగైన చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కూలీలతో నిండిన ఈ వ్యాన్ వేగం ఎక్కువగా ఉండటంతో డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గాయపడిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తున్నది. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని జమ్షెడ్పూర్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. చైబాసా నుంచి రాజ్‌నగర్ వైపు వెళ్తున్న ఈ పికప్ వ్యాన్‌లో దాదాపు 30-35 మంది కూలీలు ఉన్నారు. రాజ్‌నగర్‌లోని హంసాల్లో ఫౌండ్రీ పనిచేసేందుకు వీరంతా బయల్దేరినట్లు సమాచారం. కూలీలు పశ్చిమ సింగ్‌భూమ్‌లోని గలుబాసా, గాగ్రీ నివాసితులు. పికప్ వ్యాన్ డ్రైవర్ ఖర్సావాన్ నివాసి. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు గుర్తించారు.