Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లోని మధురలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఇద్దరు భార్యభర్తలు, మిగతా ముగ్గురు వారి పిల్లలు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధుర జిల్లా, కప్పర్పూర్ గ్రామానికి చెందిన రైతు మనీష్ కుమార్ (35), అతడి భార్య (32), మైనర్లైన ముగ్గురు పిల్లలు (ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు) ఉన్నారు. వీరి ఇంట్లోని తమ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం అయినా ఇంటి నుంచి ఎవరూ బయటకు రాలేదు. ముఖ్యంగా పిల్లలు కూడా ఆడుకోవడానికి రాకపోవడంతో మృతుడు మనీష్ సోదరుడు వారి ఇంటికి వెళ్లాడు. స్థానికుల సహాయంతో గోడ దూకి ఇంటిలోపలికి వెళ్లి, తలుపు పగలగొట్టి చూడగా.. ఐదుగురు మరణించి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఐదుగురి మృతదేహాల్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఆత్మహత్య చేసుకున్న ఇంటి గోడలపై ఒక సూసైడ్ లేఖ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఇంటి పెద్ద ఒక వీడియో కూడా రికార్డ్ చేసినట్లు తేలింది. అయితే, ఇలా సామూహికంగా కుటుంబమంతా కలిసి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఈ అంశంపై విచారణ జరుపుతున్నారు.