Odisha Train Tragedy | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సంచలన నిర్ణయాలు బయట పెట్టింది. అనుమతుల్లేని మరమ్మతులు చేపట్టడమే దీనికి కారణం అని సీబీఐ దర్యాప్తులో నిగ్గు తేలింది. సంస్థ ఉన్నతాధికారుల నుంచి సరైన అనుమతుల్లేకుండా సీనియర్ సెక్షన్ ఇంజినీర్ కం సిగ్నల్ ఇన్చార్జి అరుణ్ కుమార్ మహంతా క్షేత్రస్థాయిలో మరమ్మతులు చేయించారని ప్రత్యేక న్యాయస్థానానికి సీబీఐ నివేదించింది.
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో అరుణ్‌కుమార్ మహంతాతోపాటు ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసి విచారించింది. కాగా, అరుణ్ కుమార్ మహంతా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను భువనేశ్వర్‌లోని సీబీఐ న్యాయస్థానంలో కేంద్ర దర్యాప్తు సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. బహనగ బజార్ రైల్వే స్టేషన్‌కు సమీపాన ప్రమాదం జరిగిన 94వ క్రాసింగ్ లెవల్ గేట్ వద్ద అరుణ్ కుమార్ మహంతా సమక్షంలోనే మరమ్మతులు జరిగాయని న్యాయస్థానానికి సీబీఐ వివరించింది.
ఈ మరమ్మతుల విషయమై అరుణ్ కుమార్ మహంతా.. రైల్వేశాఖ సిగ్నల్ అండ్ టెలికం సీనియర్ డివిజనల్ ఇంజినీర్ అనుమతి గానీ, సర్క్యూట్ చిత్రం గానీ తీసుకోలేదని పేర్కొంది. 79వ నంబర్ గేటు మరమ్మతులకు వినియోగించిన సర్క్యూట్ చిత్రం ఆధారంగానే 94వ నంబర్ గేట్ వద్ద మరమ్మతులు చేపట్టారని, మరమ్మతుల టైంలో అరుణ్ కుమార్ మహంతా అక్కడే ఉన్నారని తెలిపింది. కనుక ఆయనకు బెయిల్ మంజూరు చేయొద్దని కోరింది.
సీబీఐ వాదనను వ్యతిరేకించిన అరుణ్ కుమార్ మహంతా వాదనలతో న్యాయస్థానం విభేదించింది. ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా బాధ్యతల నిర్వహణలో విఫలమైనందు వల్లే జరిగిన రోడ్డు ప్రమాదంలో 296 మందికి పైగా ప్రయాణికులు మరణించారని పేర్కొన్నది. దర్యాప్తు నివేదిక, అందుబాటులో ఉన్న వివరాల మేరకు ఈ దుర్ఘటనకు అరుణ్ కుమార్ మహంతాయే ప్రధాన కారకుడని భావిస్తున్నట్లు తెలిపింది.